Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
పోలియో మహమ్మారి సోకి అంగవైకల్యాన్ని మిగిల్చినా ఏమాత్రం కుంగిపోకుండా కెరటంలా ఎగిసిపడి ఉపరాష్ట్రపతి సైతం ఆమెను ప్రశంసించేలా ఎదిగిన ఓ వీరవనిత గాధ ఇది. ఆమె ఎవరో కాదు, సత్తుపల్లికి చెందిన ప్రతిగుడుపు మాధవీలత. ఆమె తండ్రి పార్ధసారధిరాజు 40 యేండ్ల క్రితం సత్తుపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన నలుగురు సంతానంలో చిన్నదైన మాధవిలతకు ఏడు నెలల వయసులోనే పోలియో వ్యాధి సోకి అంగవైకల్యానికి గురయింది. మాధవీలత ఇంటర్మీడియేట్ వరకు సత్తుపల్లిలోనే సాగింది. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సాధించారు. అక్కడ ఉద్యోగం చేస్తుండగానే చికిత్స కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఉద్యోగాన్ని కూడా చెన్నైకు మార్పించుకుని మద్రాస్ చేరుకున్నారు. మాధవీలతకు వైద్య చికిత్సలో భాగంగా హైడ్రోధెరపీ పద్ధతిని డాక్టర్లు ఎంపిక చేశారు. పోలియోపై అది అంతగా ప్రభావం చూపపోయినా, సొరచేపలా ఈదే గుణాన్ని మాధవీలత అలవర్చుకుంది. ఆ సాధనతో 2011, 2014, 2015 సంవత్సరాల్లో జరిగిన పారాలింపిక్స్ ఈతపోటీల్లో అనేక బంగారు పథకాలు మాధవీలత గెలుచుకున్నారు.
తనలాంటి వారికోసం.....
తనలా పోలియోతో బాధపడే వారిలో ఆత్మస్ధైర్యం నింపేందుకు తానే ముందుకు వచ్చి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహకారంతో పారాలింపిక్స్ స్విమ్మింగ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యాంగులను జాతీయ క్రీడాకారులుగా తయారు చేశారు. 2011లో 4గురు సభ్యులతో మొదలైన అసోసియేషన్ ప్రస్తుతం 300 మంది సభ్యులున్న సంస్థగా అవతరించింది. పారాలింపిక్స్‌లో వీల్‌ఛైర్ వాలీబాల్ క్రీడను చేర్చే వరకూ అలుపెరుగని పోరాటం చేసి చివరకు మాధవి అందులోనూ విజయం సాధించారు. 'అవును! మేము కూడా చెయ్యగలం' అనే స్వఛ్చంద సంస్థను ఏర్పాటు చేసి దివ్యాంగులకు అనుకూ లమైన క్రీడలను ప్రోత్సహించేలా ఉద్యమాలు చేపట్టారు. అనేక దివ్యాంగ క్రీడా సంస్థల, కమిటీల వ్యవస్థాపక ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే ప్రశంశలు...
మాధవీలత గురించి తెలుసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలోని రాజ్‌భవన్‌కు ఆమెను ఆహ్వానించి సత్కరించారు. ఆమె రాసిన 'స్విమ్మింగ్ ఎగైనెస్ట్ ద టైడ్' అనే పుస్తకాన్ని స్వయంగా చదివిన వెంకయ్యనాయుడు తన అమూల్యమైన స్పందనను మాధవీలతకు తెలియజేశారు. మాధవీలతతో ముచ్చటించిన వెంకయ్యనాయుడు నేను ఉదయాన్నే బాస్కెట్ బాల్ ఆడతాను, మీరు కూడా నాతో బాస్కెట్‌బాల్ ఆడడానికి రండి అని ఆహ్వానించడం ఆమె పట్ల వెంకయ్యనాయుడుకు ఉన్న గౌరవానికి నిదర్శనం. మాధవీలతను సత్కరించిన విషయాన్ని వెంకయ్య నాయుడు స్వయంగా తన ఆఫిషియల్ ఫేస్బుక్ పేజీలో కూడా పోస్టు చేయడం విశేషం.