Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాపోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్రావు పిలుపు నిచ్చారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం పార్టీ సీనియర్ నాయకులు బట్టు పురుషోత్తం అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పోతినేని మాట్లాడుతూ మోడీ హయాంలో మతఘర్షణలు,దళిత బహుజనులపై దాడులు పెరిగాయన్నారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారన్నారు.దేశ రాష్ట్ర కార్మిక కర్షక ప్రజలకు ఉపాధి లేకుండా చేసి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజలపై అధిక భారాలు మోపుతున్నా రని ఆయన విమర్శించారు.వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేస్తూ రైతుల మెడలకు ఉరితాళ్ల బిగిస్తూ మూడు నల్లచట్టాలను ప్రధాన మంత్రి మోడీ తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ రుణాలను ఎగ్గొట్టే బడాచోరీలకు రాయితీలు కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరితమైన విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త పథకాలు గుర్తొస్తాయన్నారు. కెసిఆర్ పాత హామీలను విస్మరించి ప్రజలకు కుచ్చుటోపి పెట్టారన్నారు. దళిత బంధు పేరుతో దళితులకు మాయమాటలు చెప్పి హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త డ్రామాలు కేసీఆర్ ఆడుతున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, బండి పద్మ, పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, మండల కమిటీ సభ్యులు వై. రవికుమార్, కందుల భాస్కర్రావు, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, కోలేటి ఉపేందర్, మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి, ఇరుకు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.