Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రెండు రోజుల్లో రోజుకు వెయ్యి మి.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో 1041.1 మి.మీ వర్షపాతం నమోదవగా, సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,306 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షం ధాటికి జిల్లాలో 2,153 మంది రైతులకు చెందిన 3,772 ఎకరాల్లోని పంటలు స్వల్పంగా దెబ్బ తిన్నాయని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. 1,381 మంది రైతులకు చెందిన 2,720 ఎకరాల వరి పొలాల్లో నీరు నిలిచింది. 355 మంది రైతులకు చెందిన 452 ఎకరాల పత్తి నీటిపాలైంది. 417 మంది రైతులకు చెందిన 600 ఎకరాల మిర్చి వర్షం బారిన పడింది. జిల్లాలోని కొన్ని మండలాల్లో 100 మి.మీ కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. వైరా, కొణిజర్ల, కామేపల్లి, కారేపల్లి, తల్లాడ, కూసుమంచి, ముదిగొండ, తిరుమలాయపాలెం మండలాల్లో అధిక వర్షం కురిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం పంట నష్టాల వివరాలను రాష్ట్రస్థాయి అధికారులకు పంపుతామని జిల్లా ఉద్యాన, వ్యవసాయశాఖల అధికారులు జి.అనుసూయ, విజయనిర్మల వెల్లడించారు.
+ వరి:
వరి అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో 442 మంది రైతులకు చెందిన 781ఎకరాల పొలాలు దెబ్బతిన్నాయి. కొణిజర్లలో 209 మంది రైతులకు చెందిన 480 ఎకరాలు నీటిపాలయ్యాయి. వైరాలో 315 ఎకకరాలు దెబ్బతినగా 99 మంది రైతులు నష్టపోయారు. సత్తుపల్లిలో 124 మంది రైతులకు చెందిన 203 ఎకరాలు, కామేపల్లిలో 92 మంది 220 ఎకరాలు, మధిరలో 109 మంది 292 ఎకరాలు, కారేపల్లిలో 130 మంది 150 ఎకరాలు, ఏన్కూరులో 142 మంది 185 ఎకరాలు, ఎర్రుపాలెంలో 30 మంది రైతులకు చెందిన 70 ఎకరాల్లో వరి నీటిపాలైంది.
- సస్యరక్షణ: వరి దుబ్బు నుంచి పూత దశలో ఉన్నది. పొలాల్లో నుంచి వెంటనే నీరు బయటకు పంపాలి. పూత దశలో మానిపుండు తెగులు ఆశిస్తుంది కావున 1 గ్రాము కార్బండిజమ్, ప్రోపికోనోజోల్ 1 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అగ్గితెగులు మెడవిరుపు గమనిస్తే ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోతెయోలిన్ 1.5 మి.లీ లేదా కానుగ మైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పాముపొడ తెగులు ఆశిస్తే కొనజోల్ 2 మి.లీ, లేదా ప్రోపొకోనజోల్ 1 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
+ పత్తి:
పత్తి అత్యధికంగా సింగరేణి మండలంలో వర్షం పాలైంది. 270 మంది రైతులకు చెందిన 300 ఎకరాలు నీటమునిగాయి. మధిరలో 32 మంది రైతులు 52 ఎకరాలు, ఏన్కూరులో 35 మంది 45 ఎకరాలు, వైరాలో 18 మంది రైతులకు చెందిన 55 ఎకరాల్లో పంట వర్షంపాలైంది.
- సస్యరక్షణ: పూత, పిందె దశలో ఉన్న పత్తిలో నీరు తొలగించాలి. పంట ఎర్రబడితే పొటాషియం నైట్రేట్ 10 గ్రా., 19-19-19 పది గ్రాములు లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. నల్లరేగడి నేలల్లో వేరుకుళ్లు ఆశిస్తే 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 25 గ్రాముల యూరియా, 10-15 కిలోల పొటాష్‌ను మొక్కకు 5-7 సెం.మీ దూరంలో వేస్తే పోషకాలు అందుతాయి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గమనిస్తే కాపర్ ఆక్సిక్లోరైడ్, 30 గ్రా+ స్టెప్టోమైసిన్/ ప్లాన్టామైసిన్ 1 గ్రామును 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. గులాబీరంగు పురుగు నివారణకు ప్రొపినోఫాస్ 2 మి.లీ, లేదా థయోడీకార్బ్ 1.5 గ్రా, లేదా క్లోరీఫైరీఫాస్ 2.5 మి.లీ లేదా ఇమామేక్టిన్ టెంజోయేల్ 0.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
+ మిరప:
మిర్చి ఖమ్మం నియోజకవర్గంలో 115 మంది రైతులకు చెందిన 170 ఎకరాలు, వైరా నియోజకవర్గంలో 135 మందికి చెందిన 160 ఎకరాలు, పాలేరులో 152 మందికి చెందిన 230 ఎకరాలు, సత్తుపల్లిలో 15 మందికి చెందిన 40 ఎకరాలు మొత్తం 417 మంది రైతులకు చెందిన 600 ఎకరాల్లో మిర్చి పంట వర్షం పాలైంది.
- సస్యరక్షణ: మిరుప నాటే దశ నుంచి పూత, పిందె దశ వరకు ఉంది. నీరు నిల్వ కుండా చూడాలి. కాండం కుళ్లు తెగులు ఆశిస్తే ప్రోసేట్ మిథేల్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశిస్తే కాపర్ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు + స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని డాట్ శాస్త్రవేత్తలు సూచించారు.