Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిం చాలని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నిర్ణయిం చింది. జెనీవా దేశంలో 1946లో ఏర్పడిన ఈ సంస్థ గుండె వ్యాధులపై అవగాహన కల్పించి, వ్యాధి రాకుండా చేయాలని సంకల్పించింది. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటు చేసి 1999 నుంచి ప్రతియేటా వరల్డ్ హార్ట్ డేను నిర్వహిస్తోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా నేపథ్యంలో గుండెను ఎలా కాపాడుకోవాలో ఖమ్మంలోని కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు విశ్లేషించారు.
గుండెకు కరోనా ముప్పు
కరోనా బారిన పడినవారికి హార్ట్ ఎటాక్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. 50 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్నవారు కరోనా బారిన పడితే సైలెంట్‌గా మృత్యువు చేరవవుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కొవ్వు పదార్థం లేకున్నా సరే గుండెకు రక్తం సరఫరా చేసే చిన్నరక్తనాళాలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. కరోనా రోగులకు ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో పాటు గుండెజబ్బు రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు న్నాయి. కరోనా వల్ల రక్తనాళాలో రక్తం గడ్డకడుతుంది. ఇలా జరగకుండా వైద్యులు పేషెంట్స్‌కు యాంటి ప్లేట్లెట్ డ్రగ్స్ ఇస్తుంటారు. యాస్ప్రిన్, లోపిడోగ్రిల్, టికాగ్రలార్ తదితర రక్తపు గడ్డలను నివారించే మందులు ఇస్తారు. రక్తాన్ని పలుచన చేసేందుకు హెపారిన్ అనే ఇంజెక్షన్‌ను కూడా ఇస్తుంటారు. వందమందికి కరోనా వస్తే 2.5 శాతం మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్లందరూ కేవలం శ్వాస సంబంధిత వ్యాధులతోనే కాదు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతోనూ కరోనా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, బీపీ బాధితులకు కరోనా వస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గుండెపై పెరిగిన ఒత్తిడి
ప్రతిరోజు 1.15 లక్షలసార్లు లబ్‌డబ్ అని స్పందిస్తూ..రెండు వేల గ్యాలన్ల రక్తాన్ని శుద్ధి చేసి, 60వేల మైళ్ల దూరం వరకు ప్రవహించేలా పంపింగ్ చేసే పిడికెడు గుండె ఆధునిక మనిషి వేగాన్ని అందుకోలేకపోతుంది. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల గుండెపై ఒత్తిడి పెరిగింది. ప్రతియేటా గుండె జబ్బులు, మరణాలు పెరుగుతున్నాయి.
- రోజుకు గుండె సరఫరా చేసే రక్తం 7,500 లీటర్లు
- రోజులో గుండె లబ్డబ్ల సంఖ్య 1.15 లక్షలు
- నిద్రలో తగ్గిపోయే లబ్‌డబ్‌లు 60శాతం
- మనిషి బరువులో గుండె 0.3శాతం.
- మహిళల కంటే పురుషుల గుండె బరువెక్కువ
- పురుషుల గుండె కంటే మహిళల గుండే వేగంగా కొట్టుకుంటుంది.