Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 34 కుటుంబాలకు పరీక్షలు
అ సీఐ, ఎస్సైలను అభినందించిన ఎస్పీ
నవతెలంగాణ-చర్ల
మండలంలోని కుదునూరు సమీపంలో అటవీ గిరిజన ప్రాంతమైన వీరాపురంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా 34 కుటుంబాల వారు జ్వరాలతో బాధపడడం, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ అశోక్, ఎస్ఐ రాజువర్మ, వెంకటప్పయ్య మానవతా దృక్పథంతో ఆ గ్రామంలోని 34 కుటుంబాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాహనాల ద్వారా తరలించారు. అనంతరం చర్ల ప్రభుత్వ వైద్యశాలలో 43 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఐదుగురికి డెంగ్యూ, 27 మందికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. సీఐ అశోక్ ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది దగ్గరుండి గిరిజనులకు వైద్యం చేయించి, మందులు అందజేశారు. ఈ సందర్భంగా చర్ల పోలీసుల ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, దోమతెరలు పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గిరిజనులకు చర్ల పోలీసులతో పాటు సహాయ సహకారాలందించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుమ, సిబ్బందికి ఈ సందర్భంగా పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ దత్ మారుమూల అటవీ ప్రాంత గిరిజనులను వాహనాల ద్వారా తీసుకు వచ్చి వైద్య చికిత్సలు చేయించిన సీఐ అశోక్, ఎస్సైలు రాజు వర్మ, వెంకటప్పయ్య, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా చాలా మంది ఆదివాసీ గిరిజనులు, మిలీషియా సభ్యులు, మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులు, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన దళ సభ్యులు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్నట్లు మాకు సమాచారం ఉందని ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటనలో తెలియజేసారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారంతా మెరుగైన వైద్యం కోసం పోలీసు వారి సహాయం తీసుకోవాలని కోరారు.