Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
నిత్యం రద్దీగా ఉండే బోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రావస్థలో ఉన్నాయి. పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం దిశగా పనిచేయడం లేదు. మండల కేంద్రంలో గత రెండు సంవత్సరాల క్రితం ప్రజల, వ్యాపారస్తుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన కొద్ది నెలలపాటు నిఘా నేత్రం తన విధిని నిర్వహించింది. ఆ తర్వాత నిఘా నేత్రం మరమ్మతుల పాలైంది. ఆ రోజు నుంచి నేటి వరకు ఆ మెగా నేత్రం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. ఈ నిఘా నేత్రాలు పనిచేయకపోతే ప్రధానంగా ఖమ్మం, జగ్గయ్యపేట, వైరా ప్రధాన రహదారులపై జరిగే ప్రమాదాలు, దొంగతనాలు, ఎన్నో అక్రమ కార్యకలాపాలకు, అసాంఘిక శక్తుల ఆగడాలకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయని మండల ప్రజా పతినిధులు, ప్రజలు భావిస్తున్నారు. నిఘా నేత్రాల వల్ల పోలీస్ శాఖకు పలు కేసులలో పురోగతి సాధించవచ్చునని, అందువల్లనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
బోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు. ఈ సిసి కెమెరాల వల్ల ప్రారంభంలో ఎన్నో దొంగతనాల కేసులను, వాహనాల చోరీలను పోలీసులు చోధించగలిగారు. సీసీ కెమెరాల ప్రారంభ సమయంలో మండలంలో బోనకల్ రైల్వే గేటు వద్ద ద్విచక్ర వాహనాలు అనేకం చోరీకి గురయ్యాయి. ఈ సిసి ఫుటేజ్ ద్వారా చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను గుంటూరు జిల్లాలో బోనకల్ పోలీసులు పట్టుకున్నారు. పది మంది పోలీసులు చేయలేని పని ఒక సిసి కెమెరా ఎటువంటి కఠినమైన శ్రమ లేకుండా తేలికగా పనిచేస్తుంది. పోలీసు శాఖకు అవసరమైన ఎన్నో రకాల సేవలను సీసీ కెమెరాలు అందజేస్తున్నాయి. ప్రతి పనిలో సిసి కెమెరాల ప్రాధాన్యత ఎంతో ఉన్నది. అంత ప్రాధాన్యత కలిగిన నిఘా నేత్రం పట్ల పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల బోనకల్ మండల కేంద్రంలో చోరీల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలకు ఒక వరంగా మారింది. మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఇళ్ళ ముందు పెట్టిన వాహనాలను చాలా తేలికగా అపహరించుకు పోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిఘా నేత్రాలు 'నిఘా' వేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.