Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
బతుకమ్మకు ప్రధానంగా తంగేడు పువ్వు
బతుకమ్మ పేర్చుటలో ప్రధానంగా అడవుల్లో దొరికే తంగేడు పూవు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పూవ్వులు లేకుండా బతుకమ్మ జరుగదు. పూవులలో శ్రేష్టమైనది గుమ్మడి పువ్వు. ఎందుకంటె గుమ్మడి పువ్వులోని కేసరాలు పసుపు గౌరమ్మకు ప్రతీక. గునుగు, తంగేడు, బంతి, చామంతి, తామెర, కట్ల పూవు, దోసపూవు, బీరపూవు, గడ్డి పూవు తదితర నేక రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. మట్టితో చేసిన దుర్గమ్మ బొడ్డె దీనినె బాద్రపద పున్నమి బొడ్డెమ్మల పున్నమి అంటారు.
బతుకమ్మ తల్లుల పండుగ, బొడ్డెమ్మ పిల్లల పండుగ
బొడ్డి అంటే చిన్న పిల్ల అని అర్ధం. బొడ్డెమ్మ పెళ్ళికాని పిల్లలు మాత్రమే ఆడతారు. బొడ్డెమ్మను పూజించడమంటె ప్రకృతిని ఆరాధించడం అని ప్రచారంలో ఉంది. తెలంగాణలో ఆడపిల్లల్ని చిన్నప్పుడు బొడ్డి, బొడ్డెమ్మ అని పిలుస్తారు. అంటె తల్లికి అనుసంధానమైనదని రేపటి బతుకుకు మూలమైనదని అందుకే బతుకమ్మ తల్లుల పండుగ, బొడ్డెమ్మ పిల్లల పండుగ అయ్యింది. బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలో తరతరాల మౌఖిక సాహిత్య వారసత్వం ముందు తరాలకు అందుతోంది. పిల్లలు వెదురుతో చేసిన సిబ్బిలో పూలను పేర్చుకొని బొడ్డెమ్మ చుట్టూ పెట్టి ఆడతారు. రకరకాల పూలను ఒక తాంబాళంలో పేర్చి పైన పసుపుతో చేసిన గౌరిమాతను పెట్టి చుట్టు దీపాలతో ఆలంకరిస్తారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ పాడతారు. సిబ్బి లేక ఇత్తడి తాంబాళంలో గుమ్మడి ఆకులు అడుగున పేర్చి వాటిపై రకకరాల పూలు పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. మధ్యలో నింపడానికి ఆకులు, చిన్నచిన్న కొమ్మలు నింపుతారు. పై భాగాన పత్తి వత్తితో చేసిన జ్యోతిని వెలిగిస్తారు. పైన గుమ్మడి పువ్వు ఉంచి అందులో పసుపు గౌరమ్మను ఉంచుతారు.
నేటి నుండి 9 రోజులు ఒక్కొరోజు ఒక్కో ప్రత్యేకత
సత్తుపిండి తదితర ఫలహారాలతో మహిళలకు శక్తి
నేడు మొదటి రోజు నువ్వులు, నూకల నైవేద్యంతో ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో ఎంగిలి పడ్డాక (తిన్నాక) పేరుస్తారు. రెండవ రోజు పప్పు, బెల్లం అటుకుల బతుకమ్మ పేరుతో పూజిస్తారు. మూడవ రోజు తడి బియ్యం బతుకమ్మ. నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ(అర్రెం, ఈ రోజు బతుకమ్మ ఆడరు) ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని వేప పండు ఆకారంలో తయారు చేస్తారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లంతో వెన్నె ముద్దల బతుకమ్మ. తొమ్మిదవ చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఈ బతుక్మ పండుగ చివరి రోజు గ్రామాలు, పట్టణాల్లో వివిధ కూడళ్ళలో అలుకు చల్లి గుండ్రంగా ముగ్గులు వేస్తారు. అందగా అలకంరించుకుని ముస్తాబైన ఆడపడుచులు, మహిళలంతా బతుకమ్మకు ఆగర్బత్తులు పెట్టి మొక్కుతారు. బతుకమ్మలను చేతపట్టుకుని బయలుదేరుతారు. తీసుకువచ్చిన బతుకమ్మలను చుట్టు వరుస క్రమంలో ఉంచుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ కోలాటం వేస్తు పాటలు పాడారు. అనంతరం మగవారు బతుమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. తరువాత సత్తు పిండి, నువ్వుల పిండి, బెల్లం, బియ్యం పిండి మొదలకు వాటితో తయారు చేస్తారు. బతుకమ్మ ఆడిన తరువాత ఇంటి నుండి తెచ్చిన పిండి వంటలు, పెరుగన్నం, సత్తు పిండీలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఇస్తినమ్మ వాయినం, పుచ్చు కుంటినమ్మ వాయినం అంటూ తీసుకంటారు. బతుకమ్మ సందర్భంగా పంచె సద్దుల ఫలహారాలలో స్త్రీలలోని రోగ నిరోధక శక్తిని పెంచే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఫలహారాలు స్త్రీలకు శక్తినిస్తాయి.