Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
పేదల కడుపు మండితే ప్రభుత్వానికి దిమ్మతిరిగే సమాధానం ఎలా ఉంటుందో మంగళవారం జరిగిన రహదారుల దిగ్భంధం తెలియజేసింది. పోడు చేస్తున్న పేదలపై ప్రభుత్వ నిర్భంధాలు, పంటల ధ్వంసం, పసిపిల్లలు పిల్లల తల్లులపై కేసులు పెట్టి జైలు పంపటం వంటి నిరంకుశత్వం తారస్ధాయికి చేరుకుంది. పోడుపైనే బతుకుతున్న ఏజన్సీ పేదల జీవితాల్లో చీకటి రోజులు తీసుకవచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై పేదలు కన్నెర్ర చేశారు. పోడు భూమిలో సాగు చేసుకోవాల్సిన రైతులు రోడ్డెక్కారు. కారేపల్లి క్రాస్‌రోడ్‌లో కారేపల్లి, కామేపల్లి మండలాల సీపీఐ(ఎం), సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ, జనసమితి ఆధ్వర్యంలో పోడు రైతులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి తమ పట్టుదలను చూపగా వారికి అండగా అదే పట్టుదలతో అఖిల పక్ష వేతలు నిలిచి పోరాటపటుత్వాన్ని తెలియజేశారు. ఖమ్మంరూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సింగరేణి సీఐ తాటిపాముల సురేష్, ఎస్సైలు పీ.సురేష్, స్రవంతి, వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందో బస్తు నిర్వహించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని నేతలు రాస్తారోకోను మధ్యాహ్నం 2గంటలకు విరమించారు.
కేసీఆర్‌కు పోడు దెబ్బ రుచి చూపిద్దాం
పోడుపై మాట తప్పిన కేసీఆర్‌కు పోడు దెబ్బ రుచి చూపిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పీ.సోమయ్య, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు మౌలాన, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, పగడాల మంజుల, జనసమితి నేత గోపగాని శంకర్రావు, ఎన్డీ నాయకులు వై.ప్రకాష్ అన్నారు. పోడుపై కారేపల్లి క్రాస్‌రోడ్‌లో జరిగిన రహదారుల దిగ్భంధం సందర్బంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ మాటలతో మోసపుచ్చటం కేసీఆర్ నైజమని పోడుపై మరోసారి బయటపడిందన్నారు. పోడుపై డిల్లీ వెళ్లుతున్నామని కేసీఆర్ కబుర్లు చెప్పుతున్నాడని, సమస్య డిల్లీలో లేదు గల్లిలో ఉందన్నారు. అధికారులను గ్రామాలకు పంపి పోడుకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం హక్కు కల్పించటానికి డిల్లీకి అవసరం లేదని గల్లీలో చేయవచ్చన్నారు. కేసీఆర్ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్ కాకమ్మ కబుర్లను నమ్మె స్ధితిలో లేరన్నారు. పోడుపై హక్కు కల్పించపోతే కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవన్నారు. సాయుధ పోరాటంలో నిరంకుశ నిజాం నవాబ్‌ను మట్టికరిపించిన చరిత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలదన్నారు. 2005 డిసెంబర్‌కు ముందు పోడు సాగు చేస్తున్న పేదలందరికి హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాని దన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, కే.నాగేశ్వరరావు, పిట్టల రవి, మేకల నాగేశ్వరరావు, చింతల రమేష్, కే.నరేంద్ర, వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్, ముండ్ల ఏకాంబరం, అంబటి శ్రీనివాసరెడ్డి, దారావత్ సైదులు, సీపీఎం సర్పంచ్‌లు బానోత్ బన్సీలాల్, హలావత్ ఇందిరాజ్యోతి, కాంగ్రెస్ కామేపల్లి జడ్పీటీసీ బానోత్ వెంకటప్రవీణ్‌కుమార్ నాయక్, సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, ఎంపీటీసీ జగన్నాధరెడ్డి, దమ్మాలపాటి సత్యనారాయణ, తలారి చంద్రప్రకాశ్, హర్షానాయక్, గుగులోత్ భీముడు, సీపీఐ సర్పంచ్ కోరం కోటమ్మ నాయకులు సీతామహాలక్ష్మి, ఏపూరి లతాదేవి, తాతా వెంకటేశ్వర్లు, ధన్‌రాజ్, ఉంగరాల సుధాకర్, దూద్దికూరి వెంకట్ తాటి నిర్మల, న్యూడెమోక్రసీ నాయకులు గుగులోత్ తేజానాయక్, కంచర్ల శ్రీనివాసరెడ్డి, టీడీపి నాయకులు తోటకూరి శివయ్య, పోలూరి రామారావు, దూదిపాళ్ళ భాస్కర్‌రావు, యాకుబ్, కంచి రమేష్ తదితరులు పాల్గొన్నారు.