Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తి జి.శ్రీదేవి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నట్లుగా మహిళలకు కోర్టుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించడం సముచితం అని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన జడ్జి జి. శ్రీదేవి అన్నారు. ఆధునికీకరించిన బార్ అసోసియేషన్ హాల్‌ను ప్రారంభించేందుకు బుధవారం కోర్టు ప్రాంగణానికి వచ్చిన ఆమె ఆ తర్వాత జరిగిన సమావేశంలో ముఖ్యోపన్యాసం చేశారు. మహిళలకు అన్నిరంగాల్లోనూ సముచిత స్థానం కల్పిస్తే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం న్యాయవాదుల సమస్యలపై హైకోర్టు జడ్జికి వినతిపత్రం సమర్పించారు. సబ్‌కోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని జడ్జి హామీ ఇచ్చారు. కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అంతకు ముందు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు చంద్రశేఖరప్రసాద్, అరుణకుమారి, మౌనిక, పూజిత, డానియేల్, అక్తర్, అనితారెడ్డి, శాంతిసోని, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మలీదు నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, తిరుమలరావు, జీపీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.