Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల తరబడి అనుభవిస్తున్నా చావని ఆశ
- కోట్ల రూపాయల విలువైన భూమి కాజేసేందుకు ఎత్తులు
- సినిమాలు నడవడంలేదు... అందుకే కూల్చివేస్తున్నాం...!
- ఏండ్ల తరబడి ప్రజలను నమ్మించిన బడా వ్యాపారులు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో ఉన్న దుర్గ కళామందిర్ సినిమా హాల్ పూర్వచరిత్ర పరిశీలిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజాం కాలంలో బహుమతిగా పొందిన చిట్టి శేషమ్మకు చెందిన రెండు ఎకరాల భూమిలో చిట్టి శేషమ్మ సత్రం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి భద్రాచలం వెళ్లే భక్తులకు సేద తీరేందుకు 1961లో సత్రం నిర్మించారు. కొంతకాలం సక్రంగా భక్తులకు ఆశ్రయం కల్పించింది. అనంతరం వారు కాలం చేశారు. వారి పూర్వీకులు ఎవరూ లేకపోవడంతో వారి ఆస్తులపై ఎవరికి పట్టని విధంగా మారింది. ఇదే అదునుగా చూసిన పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు కలిసి 1967లో నకిలీ పత్రాలు సృష్టించి సత్రం భూమిలో కమర్షియల్ వ్యాపారానికి తెరలేపారని తెలుస్తుంది. 1978లో చిట్టి శేషమ్మ సత్రం భూమిలో దుర్గా దుర్గా కళామందిర్ పేరుతో సినిమా హాల్ నిర్మాణం చేపట్టారు. 1979లో సినిమా హలు నిర్మాణం పూర్తిచేశారు. మొదటి సినిమాగా ఆనాడు 'రామబాణం' చిత్రం విడుదల చేశారు. ఆనాటి నుండి 40 సంవత్సరాల పాటు థియేటర్లో వేల సినిమాలు ప్రదర్శించారు. కోట్ల లాభాలు అర్జించారు. సినిమా హాల్‌తో పాటు పక్కనే మరో వాణిజ్య వ్యాపార సంస్థను నిర్మించి అనుభవిస్తున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి సమాజాన్ని ఈ స్థలం వారిదే అనేలా అందరిని నమ్మించారు. కొంత కాలం క్రితం సత్యనారాయణ అనే వ్యక్తి చిట్టి శేషమ్మ, సత్రం భూమి వివరాలు తెలుసుకుని ఇది చిట్టిశేషమ్మ సత్రం భూమి అని, దీన్ని ఇతరులు అక్రమంగా అనుభవిస్తు, వందల కోట్ల విలువైన భూమిని అక్రమించేందుకు చర్యలకు పూనుకున్నారని 2008లో ప్రభు త్వంకు అనుకూలంగా లోకా యుక్తలో కేసు వేసినట్లు సమాచారం.
కోవిడ్-19 కారణంగా గత రెండు సంవత్సరాల కాలంలో సినిమా హాల్స్‌లో వెండితెరమీద సినిమాలు నడవలేదు. చివరి చిత్రంగా 'వకీల్‌సాబ్ ' చిత్ర ప్రదర్శన జరిగినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. 1979 నుండి 2021 వరకు రెండు వాణిజ్య సంస్థల పరంగా కోట్ల రూపాలయల ఆదాయాన్ని అప్పనంగా తింటున్నారు. ఇటీవల ఇండ్ల స్థలా క్రమబద్దీకరణ జరుగుతున్న తరుణంలో సత్రం భూమిని చిట్టి శేషమ్మ ఒకరికి అమ్మకాలు చేసినట్లు, వారి నుండి పలువురికి అమ్మకాలతో చేతుమారినట్లు నకిలీ డాక్యూమెంట్లు తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని రూ.100 కోట్ల విలువైన భూమిని పలువురి పేర్లమీద క్రమబద్దీకరణ పట్టా చేయించుకునేందుకు సంబంధిత అధికారులకు లక్షలాది రూపాయలు ఇచ్చి పట్టాల తయారికి సన్నాహాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని క్రమబద్దీకరణ పట్టాలు పొందినట్లు వినికిడి. గత కొంత కాలంగా లోకాయుక్తలో కేసు నడిచింది. సత్రం భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని అక్రమార్కులు లోకాయుక్తా ముందు వాపోయారని సమాచారం. సక్రమైన పత్రాలు చూపని కారణంగా పలు వాయిదాల అనంతరం లోకాయుక్త అక్రమార్కులకు వ్యతిరేకంగా తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వీరు సినిమా హాల్ నిర్మాణం కనిపించకుండా కూల్చివేసే ప్రయత్నాలకు పూనుకున్నారు. ఇది తెలుసుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దుర్గాకళామందిర్ ప్రాంగణం వద్దకు చేరుకుని, కూల్చివేత పనులను అడ్డుకున్నారు. ఎలాంటి పనులు చేయకూడదని హెచ్చరింకలు జారీచేశారు. స్థలాన్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ బడా వ్యాపారులకు ఆశ చావడం లేదు. మరోమారు కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రచారం సాగుతుంది.