Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధి పనుల పేరిట స్వాహా గ్రామస్తుల ఆరోపణ
నవతెలంగాణ-పెనుబల్లి
పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే సర్పంచ్, ఉప సర్పంచ్, సంబంధిత శాఖ అధికారులు కుమ్మక్కై లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల పేరిట పాల్పడ్డ అక్రమాలపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఆధారాలలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్రాలపాడు గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పడింది. ఎస్సీ రిజర్వుడు పంచాయతీ. 180 కుటుంబాలు ఉన్నాయి. 9 వార్డులు, సర్పంచ్‌తో పంచాయతీ కొలువుదీరింది. నూతనంగా ఏర్పడిన పంచాయతీలో పలు అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశించిన గ్రామస్తులకు అదే స్థాయిలో అవినీతి జరగడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికి సర్పంచ్ తీరుపట్ల ఆగ్రహంగా ఉన్న ప్రజలను గమనించిన సర్పంచ్ వారిని చల్లబరిచేందుకు సీసీ రోడ్లు వేస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. నెలలు గడుస్తున్నా పనులు చేపట్టకపోవడంతో మోసపోయామని ఆలోచనలో ఉన్న గ్రామస్తులు ఇకనైనా నిధులు దుర్వినియోగం కాకుండా నిలువరించాలని ఆలోచించి సర్పంచ్, ఉపసర్పంచి, అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం. అందులో భాగంగా ఉప సర్పంచ్‌ని తొలగించి నూతన ఉప సర్పంచ్‌ని ఎన్నుకున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మేర జనరల్ ఫండ్ పంచాయతీలో ఉండడంలో ఆ నిధులతో గ్రామాభివృద్ధి చేయడానికి సర్పంచి సహకరించడం లేదని నూతన ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో జరిగిన అవకతవకలపై గ్రామంలోని పలువురు యువకులు సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించారు. వీధిలైట్లు, పైపులైన్ల లీకులు, పారిశుద్ధ్య పనులు, జె.సి.బి తో పనులు చేయించడం తదితర పనులకు వెచ్చించిన నిధులకు సంబంధించి తప్పుడు బిల్లులతో నిధులను దుర్వినియోగం చేయడం వంటి అక్రమాలను గుర్తించారు. దీంతో సేకరించిన ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జిల్లాపంచాయతీ శాఖ అధికారులను విచారణ జరపాలని ఆదేశించారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి విచారణ జరగలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపితే పంచాయితీ అక్రమాలపై నిజానిజాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు.