Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే తొలి రోజు ఎంగిలి బతుకమ్మ ఆట పాటలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కూడళ్ళలో పంచాయతీలు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మం నిమ జ్జన ఏర్పాట్లు చేశారు. విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఆడే ప్రాంతాలలో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మహిళలు, పిల్లలు ముస్తాబై బతుకమ్మలు ఎత్తుకొని సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఉత్సాహంగా పాటలు పాడారు. ఖమ్మంలో జరిగిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజరుకుమార్ బతుకమ్మ ఎత్తుకొని వచ్చి మహిళలను ఉత్సహపరిచారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉయ్యాల పాట.. చప్పట్ల దరువు.. దస్తీబిస్తీ ఆట.. బతుకమ్మ పూట... తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం నుంచి మొదలయ్యాయి. మహాలయ అమావాస్య (పెత్రామాస)ను పురస్కరించుకుని ఎంగిలిపూలోత్సవంతో బతుకమ్మ సంబురాలు ప్రారంభించారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమైన వేడుకలు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయి. దసరాకు రెండు రోజుల ముందు ముగుస్తాయి. దీనిలో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో దినం అటుకుల బతుకమ్మ, మూడోనాడు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో దినం వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో నాడు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా చప్పగా సాగిన బతుకమ్మ సంబురాలు ఈ ఏడు కోలాహలంగా మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను చేతపట్టుకుని మహిళా మణులు కదిలారు. ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే బతుకమ్మ సంబురాలను పల్లె మొదలు పట్టణం వరకు కోలాహలంగా ఆరంభించారు. నగరంలోని గుంటు మల్లేశ్వరక్షేత్రం, శివాలయం, ప్రకాశ్‌నగర్ ఏటి బ్రిడ్జి, మున్నేరు ఒడ్డు, ఎన్నెస్పీ కెనాల్ తదితర ప్రాంతాలు, ఆలయాల్లో బతుకమ్మలాడిన మహిళలు ఆపై కొందరు ఆలయాల్లో ఉంచగా...కొందరు నీటిలో వదిలారు. ఊరూరా ఇదే రీతిలో వేడుకలు కొనసాగుతున్నాయి.