Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
దోపిడోళ్ల దుమ్ము దులిపేందుకు పేదలను ఏకం చేసిన మార్కిస్టు పార్టీ ఎర్ర మందారం.. చెరుకూరి రాఘవయ్య (80) గత ఏడాది గుండెపోటుతో మరణించారు. ఈ నెల 9వ తేదీ శనివారం 1వ వర్ధంతి సందర్భంగా కామంచికల్ గ్రామంలో స్తూపావిష్కరణ జరగనుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేతుల మీదుగా ఆవిష్కరణ చేయనున్నారు. జీవితాంతం సీపీఐ(ఎం)లో ఉంటూ తుదిశ్వాస వరకూ ఎర్రజెండాను మోసిన రాఘవయ్య పుచ్చలపల్లి సుందరయ్య, బోడెపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్రావు, డా.వైఆర్కి తదితరులు స్ఫూర్తితో రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా రాఘవయ్య గుర్తింపు పొందారు. తాను నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం అనేక విధాలుగా ఆటుపోట్లు ఎదురైనా తన లక్ష్యం పేదల కన్నీటిని తుడవటమేనని రాఘమయ్య ముందుకు కదిలారు.
ఆద్యంతం ఆదర్శం ఆ దంపతుల జీవితం...
రోజుకో పార్టీ జెండాలు మార్చే నాయకులున్న నేటి రోజుల్లో తుదిశ్వాస వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం బతికిన రాఘవయ్య జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా చెప్పవచ్చు. రఘునాథపాలెం మండలం కామంచికల్ గ్రామానికి చెందిన రాఘవయ్య, లక్ష్మీబాయమ్మ దంపతులు ఇద్దరూ తుదిశ్వాస వరకూ పేదల అభ్యున్నతి కోసం బతికారు. కామంచికల్ ప్రాంతంలో తన గ్రామంలోని కొందరితో కలిసి 1980లో జరిగిన అనేక ఉద్యమాలను రాఘవయ్య నిర్మించారంటే అతిశయోక్తి కాదు. నాడు పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు, దోపిడీ దారుల దుమ్ము దులిపేందుకు పేదలను ఏకం చేశాడు. పేదల కోసం జరుపుతున్న పోరాటాల్లో ఎన్నో రకాల దారులను భరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏమాత్రం అదరక బెదరక దండిగల కలవాడని రాఘవయ్య నిరూపించాడు. గ్రామగ్రామాన రైతు కూలీల కోసం రణం చేసి భూస్వాముల కంటిమీద కునుకు లేకుండా చేసిన రాఘవయ్య మృతితో నాటి రోజుల్లో జరిగిన ఓ హత్య కేసులో ప్రత్యర్థులు రాఘవయ్యతో పాటు ఆయన కుమారులపై కేసులు మోపి జైలుపాలు చేశారు. ఇంత చేసినా కుమారులు జైలుకెళ్లినా ఆయన భార్య లక్ష్మీబాయమ్మ మిగతా పిల్లలను చూసుకుంటూ పార్టీ కార్యకర్తలకు నిత్యం అన్నం వండిపెడుతూ భర్త చూపిన మార్క్సిస్టు బాటలో ముందుకు సాగారు.
ప్రజల మనసు గెలుచుకున్న మార్క్సిస్టు నేత...
ఉద్యమ చరిత్ర గురించి పదికాలాలపాటు జనం చెప్పుకునేలా జీవించి చూపింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన భర్త, కుమారులు ఉద్యమంలో కేసుల పాలై యావజ్జీవ శిక్షపడి జైలుకు వెళ్లినా చలించకుండా గుండెధైర్యంతో నిలబడింది. ఒక పక్క మార్కిస్టు పార్టీ సిద్ధాంతాన్ని అనుసరిస్తూనే.. మరో పక్క కుటుంబ పోషణ తలకెత్తుకుంది.. ఆమె చూపిన తెగువ, ధఅడ సంకల్పం ముందు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా గాలివాటానికి విడిపోయిన మబ్బుల్లా సమస్యలు కొట్టుకుపోయాయి. ఆమె గతేడాది అనారోగ్యంతో మరణించారు.
1980లో కాయకష్టం చేసే పేదలను చేరదీసి వారికి కూలిపోరాటాలు నేర్పించి పెట్టి చాకిరీనుండి విముక్తి కలిగించాడు. ముఖ్యంగా పూటగడవని పేదలను, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఉన్న నిరుపేదలకు కన్నకొ డుకై వారి కన్నీళ్లు తుడిచాడు. ప్రజల మనసు గెలుచుకుని తనకు భౌతికంగా చనిపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం పదిలంగా ఉండేలా మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రజల తరపున పోరాటాలకు ప్రాణమిస్తాడని తెలిసిన కొందరు ప్రత్యర్థులు అనేక విధాలుగా రాఘవయ్యపై దాడులు చేసినా ఆయనకున్న దృఢ సంకల్పం ముందు అవి సాగలేదని గ్రామస్తులు నేటికీ గుర్తుచేసుకుంటారు. కష్టజీవుల కన్నీటిని తుడిచే ఆయనను ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మచ్చలేని నాయకత్వం రాఘవయ్యది.... నున్నా త్యాగనిరతితో ముందుకు సాగిన విప్లవ వీరుడు రాఘవయ్య అని అంటున్నారు.