Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హర్సింగ్ నాయక్ అవినీతి అంతు చూస్తాం
అ నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
అ విలేకర్ల సమావేశంలో టీపీసీసీ సభ్యులు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఇల్లందు
కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి పార్టీ కార్యకర్తల శ్రమ కష్టార్జితంతో ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి గెలవాలని టీపీసీసీ సభ్యులు, ఇల్లందు నియోజక వర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక జగదాంబ సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ, మండల అధ్యక్షులు పులి సైదులు, దొడ్డ డానియల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షాడో ఎమ్మెల్యేగా పని చేస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్ నాయక్ అవినీతి అంతు చూస్తానని అన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని, హర్సింగ్ ఇలాంటి వాళ్లను వందల మందిని చూశామాని ఎవరికీ భయపడేది లేదన్నారు. టేకులపల్లి మండలంలోని తన స్వగ్రామంలో రూ.కోట్లతో త్రిబులెక్స్ ఇల్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మించారని, గ్రామస్తులకు దారి సౌకర్యం ఇవ్వక పోవడంతో రోడ్డుపైనే ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయని విమర్శించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా వైద్యశాల సౌకర్యం కల్పిస్తామని చెబుతూ పంచాయతీ అనుమతి లేకుండానే ఇల్లీగల్‌గా స్థలం కబ్జా చేశారని, ఇల్లందు జేకే సిఆర్ క్లబ్ సమీపంలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే హరిప్రియ పౌండేషన్ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారని అన్నారు.
వాస్తు పేరుతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మతులు చేపట్టి రూ.46 లక్షలు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారని అన్నారు. కోయగూడెం ఓసీ దందాలో రూ.కోట్లు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. గార్ల బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లిందని ఆప్రాంతం లారీలు ఓసి వద్దకు రావద్దని యజమానులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. దీని మూలంగా ఆర్థిక ఇబ్బందులకు లోనై ఫైనాన్సులు కట్టుకోలేక కుటుంబాలను పోషించుకో లేక లారీ యజమానులంతా అవస్థలు పడ్డారని అన్నారు. రెండున్నరేళ్లలో ఇల్లందులో చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. బస్సు డిపోకు పునాది వేసి ఏడాది పూర్తయి నేటికీ అలాగే ఉందని, ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ కల్పిస్తామని, ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుండి అనుమతులు తెప్పిస్తామని, వైద్యశాలను సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని ఇచ్చిన ముఖ్యమైన హామీలు నేటికీ నెరవేరలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు జాఫర్, ఆర్ఎం కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ ఏ బ్లాక్ అధ్యక్షులు జలీల్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.