Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాల జీఓలను ప్రస్తుత ధరలకనుగుణంగా వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్ డిమాండు చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు, వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జీఎం కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హైవపర్ కమీటీ వేతనాలు, లాభాల బోనస్, ప్రమాదంలో, కోవిడ్ ద్వారా మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సౌకర్యాలు, కార్మిక చట్టాల అమలు కోసం అనేక సార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం సమస్యను పరిస్కరించడం లేదన్నారు. 26 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కాంట్రాక్టు, అసంఘటితర కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత, కల్పించాలని, అక్రమ తొలగింపులు వేదింపులకు పాల్పడుతున్నా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కనీస వేతనాల జీఓ 22ను అమలు చేసే వరకు సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనీవాసరావు, సీనియర్ నాయకులు నెల్లూరి నాగేఠశ్వరరావు, జిల్లా కమీటీ సభ్యులు నర్సింహారావు, నాయకులు మునిగల శివప్రశాంత్, కృష్ణయ్య, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : సింగరేణిలో జీవో నెంబర్ 22ను వెంటనే అమలు చేయాలని, సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షమా....? పెట్టుబడిదారుల పక్షమా.....? తేల్చుకోవాలి సీఐటీయూ నాయకులు ఉద్ఘాటించారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్ 22 ప్రకారం నూతన వేతనాలు తక్షణమే చెల్లించాలని, కాలయాపన చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. శుక్రవారం సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై తలపెట్టిన ఒక్కరోజు టోకేన్ సమ్మె జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి హెడ్ఆఫీస్ ముందు కొత్తగూడెంలో ఉదయం 9 గంటల నుండి సుమారు మూడు గంటల పాటు వందలాది మంది కాంట్రాక్టు కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేతలు మాట్లాడుతూ సింగరేణి కంపెనీ లాభాలు సాధించడంలో అహర్నిశలు శ్రమించిపని చేస్తున్నా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల, చట్టాల అమలులో, రక్షణలో, సౌకర్యాల కల్పనలో, వేతనాలు చెల్లింపులో యాజమాన్యం వివక్షత చూపిస్తుందని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదనకు, ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సింగరేణిలో హౌస్ కీపింగ్, సివిక్, వాటర్ సప్లై, గార్డెన్స్, సిహెచ్పి, వర్స్షాప్స్ అనేక రకాల పనుల కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగాని కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, నాయకులు గాజుల రాజారావు, భూక్యా రమేష్, కె.చంద్రశేఖర్, కర్ల వీరస్వామి, వై వెంకటేశ్వరరావు, సైదమ్మ, వీరన్న, ప్రభాకర్, లక్ష్మి, శివ, భాస్కర్, హారి, అబ్దుల్, నరిసమ్మ, మల్సూర్, సంపత్, కిరణ్, జీవన్, తాతారావు, రాము తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : రాష్ట్రంలో పరిశ్రమల యజమానుల లాభాలు పెంచటం కోసం తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కడుపు మాడ్చుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి విమర్శించారు. 2010 నుండి రాష్ట్రంలో రూ.ఒక కోటి 30లక్షల మంది కార్మికుల వేతనాలు ఒక్కరూపాయి కూడా పెంచలేదన్నారు. మండలంలోని సారపాక ఐటీసీ పరిశ్రమ గేటు ముందు, లక్ష్మీపురం పేపర్ గోదాముల దగ్గర సమ్మె సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు, యజమానుల కోసం కనీసవేతనాల జీవోలను సవరించకుండా, కొత్త జీవోలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. సందర్భంగా వేలాది మంది కార్మికులు నల్లబ్యార్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పీఎస్పీడీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటరెడ్డి, ఎస్కే.పాషా, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి బత్తుల వెంకటే శ్వర్లు, సీఐటీయూ నాయకులు కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతామని సీఎం కేసీిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టు కోకపోతే గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె తప్పదని, సమ్మె జరిగితే అందుకు ప్రభుత్వం ముఖ్య మంత్రి బాధ్యత వహించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఒకరోజు సమ్మె సందర్భంగా శుక్రవారం భద్రాచ లం సబ్ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లా డారు. అదే విధంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు యం.బీ.నర్సారెడ్డి మాట్లాడుతూ పంచాయతీకి నిధులు వున్నా వేతనాలు పెంచకపోవటం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యన్.నాగరాజు, జి.పి.యూనియన్ నాయకులు కాపుల రవి, చారి, వీరయ్య, కృష్ణార్జున్ రావు, రాము, యాకుబ్ భాను, మనోజ్ సురేష్, వెంకటమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.