Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అ కళాశాలకు నూతన భవనాల నిర్మాణానికి నిధులు
మంజూరు: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
ముప్పయి రెండేండ్ల క్రితం కలిసి చదువుకున్న నాటి మధుర స్మృతులను గుర్తుచేసుకుని సంబరపడ్డారు. కలిసి చదువుకున్న ఆ పూర్వ విద్యార్థులు ఎవరెంత పెద్ద హౌదాల్లో స్థిరపడినా చిన్నాపెద్దా భేదం లేకుండా అప్పటి తమ గురువులను సైతం ఆహ్వానించి అందరూ సమ్మేళనమయ్యారు.
సత్తుపల్లిలోని శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1987-89 ఇంటర్మీడియేట్ హెచ్ఈసీ- సీఈసీ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని అదే కళాశాల ఆవరణలో ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. అప్పటి అధ్యాపకులు యాదగిరాచార్యులు, బయ్యపురెడ్డి, నియోగి, రంగారెడ్డి, గంగుల బాబు మాట్లాడారు. అప్పటి విద్యార్థులంతా కలుసుకుని మమ్మల్ని ఆహ్వానించి గత స్మృతులను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం గురువులతో పాటు అప్పటి కళాశాల సిబ్బంది శాస్త్రి, జానిమియాలను పట్టు వస్త్రాలతో సత్కరించారు. పూర్వ విద్యార్థులు గురువుల చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎండీ ముక్తార్ హుస్సేన్, నాగళ్ల ప్రసాద్, బీవీ రామారావు, సురేశ్కుమార్రెడ్డి, మొహమ్మద్ షైబుద్దిన్, చప్పిడి నాగరాజు, సి.హెచ్.వెంకటేశ్వరరావు, ఎండీ షాకిర్, రాజేశ్వరి, విజయనిర్మల, రామిశెట్టి శ్రీనివాసరావు, జోషి పాల్గొన్నారు.
నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించా...
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
శ్రీ బండి శోభనాచలం జూనియర్ కళాశాల భవనాలు శిథిల దశకు చేరుకుని విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న నేపధ్యంలో కళాశాల నూతన భవనాలకు సింగరేణి సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయించడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందేశం పంపించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి తాను కూడా హాజరు కావాల్సి ఉందని, అత్యవసర పనులు ఉన్న కారణంగా రాలేకపోయానంటూ ఫోన్ ద్వారా తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నూతన భవనాల్లో కొనసాగేలా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని పూర్వ విద్యార్థులకు తెలిపారు. తాము చదివిన కళాశాలకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించడాన్ని పూర్వ విద్యార్థులు సమ్మేళన సభలో హర్షధ్వానాల మధ్య ఆనందం వ్యక్తం చేశారు.