Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్తగూడెం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ గణేష్ టెంపుల్ నందు ''ప్రపంచ బాలికల దినోత్సవం'' సందర్భంగా న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె. దీప మాట్లాడుతూ అంతర్జాతీయ బాలికల దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న బాలికల పైన జరుగుతున్న నేరాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు తగ్గించి బాలికలు అన్ని రంగాలలో ముందు ఉండేవిధంగా తోడ్పడాలని చెప్పారు. గ్రామాలలో అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల బాల్యవివాహాలు ఎక్కువగా ఉంటున్నాయని ఆ విధంగా ఉండటం వలన వారు శారీరకంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని నిందితులను శిక్షించేందుకు పోక్సో కోర్టు ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. కొత్తగూడెం ఎస్బిఐ రీజినల్ మేనేజర్ కోలేటి మహేశ్వర్ మాట్లాడుతూ బాలికలను ప్రోత్సహించేందుకు సుకన్య సమృద్ధి యోజన పథకంను అందరు వినియోగించుకోవాలని చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్కినేని సత్యనారాయణ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పైన జరుగుతున్న నేరాలను గురించి అందుకు గల కారణములపైన అవగాహనను కల్పించడం కోసం మండల న్యాయ సేవా సంస్థ కొత్తగూడెం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ యం. బాలకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ బి. సురేష్ కుమార్, అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ హదిబ్ ఖాన్, మానిటరింగ్ కమిటీ నెంబరు రాజమల్లు, రామ్, రామ్ కుమార్, గిరిబాబు పాల్గొన్నారు.