Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావ దుర్గాభవాని
నవతెలంగాణ-మధిర
ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు చేస్తే సమస్య తీరదని, ఇందుకోసం తక్షణం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సి.హెచ్. దుర్గా భవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ రావు అధ్యక్షతన మధిర డివిజన్ కార్యాలయంలో జరిగిన డివిజన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్యకు సరిపడే ఉపాధ్యాయుల ఏర్పాటు, పాఠశాలల పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యమైందని ఆమె తెలిపారు. అందుకోసం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంతో పాటు ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు బాధ్యత అప్పగించడంతో సరిపెట్టుకుంటే క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా పారిశుద్ధ్య పనులు జరగడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకునేందుకు, ప్రభుత్వ విద్యను నిలబెట్టుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకునే విధంగా సంఘ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. జోనల్ విధానం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ రాష్ట్రపతి ఆమోదం లభించినందున విద్యాశాఖ వెంటనే సర్వీస్ నిబంధనలు రూపొందించి అన్ని స్థాయిల్లో పదోన్నతులు పూర్తిచేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా రక్షణ చర్యలు పాటిస్తూ దసరా సెలవుల అనంతరం సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అన్ని రకాల గురుకులాలు, కేజీబీవీ పాఠశాలను ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.వి. నాగమల్లేశ్వర రావు, పారుపల్లి నాగేశ్వర రావు, మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఏ. వినోద్ రావు, యస్.కె.నాగూర్ వలి, కె.రమేష్, జి.రామకృష్ణ, బి.నాగరాజు, ఏ. కోటేశ్వరరావు, నాయకులు డి. భీమశంకర రావు, యస్.కె.లాల్ అహ్మద్, వీరయ్య, జె.సురేష్ పాల్గొన్నారు.