Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం అభివృద్ధి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని హౌజింగ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే భద్రాచలంలో డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటి మధ్యలో అందమైన పూల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఎస్ఈడీ లైట్లను చర్ల రోడ్డులో, కూనవరం రోడ్డులో త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా మూడుమార్లు దళిత సంఘాల నాయకులతో, 1986లో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు వ్యవస్థాపకులైన వారితో సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. వారి నిర్ణయం మేరకే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కొంత ప్రతిష్టంభన నెలకొన్నదని, ఒక్కో ఇంటి నిర్మాణంకు రూ.35వేలు తేడా వస్తుండటంతో కౌన్సిల్ మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, త్వరలోనే ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి పేదలకు ఇస్తామని అన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో, పశువుల ఆసుపత్రి ఆవరణలో పార్కులను ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మరో పార్కును డబుల్ బెడ్ రూం ఇండ్ల దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో టాయిలెట్లు నిర్మించడం జరిగిందని, 10వేల జనాభాకు ఒక టాయిలెట్ దామాషా ప్రకారం మరి కొన్ని టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బస్టాండ్ దగ్గర, కార్ల పార్కింగ్ దగ్గర, ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం వద్ద టాయిలెట్లను త్వరలోనే నిర్మిస్తామని ఆయన చెప్పారు. భద్రాచలం వద్ద రెండో వారధి పనులు నత్తనడకన సాగుతుండటంతో ఎంపీ కవిత, కేంద్రమంది నితిన్ గడ్కారీతో మాట్లాడటం జరిగిందని, ప్రస్తుతం పనులు శరవేగంతో జరుగుతున్నాయని, శ్రీరామ నవమి కల్లా బ్రిడ్జిని ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పేదలకు రేషన్ కార్డులు, 57ఏళ్ల వారు ఆసరా పింఛన్లు కోసం ధరఖాస్తు చేసుకుంటే ఇచ్చేందుకు ఈ నెలలోనే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మార్కెట్లో మాంసం, కూరగాయలు, చేపలు, పళ్లు వేరువేరుగా అమ్ముకునే విధంగా తీర్చిదిద్దు తామన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.50కోట్లు మంజూరు అయ్యే అవకాశం ఉందని, భద్రాచలం, పర్ణశాలల్లో సర్వే పూర్తయిందన్నారు. అలాగే మిగిలిన కరకట్టను మరో రూ.14.5 కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. భద్రాచలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా త్వరలోనే టెండర్లు పిలిచి, ఆ పనులు కూడా పూర్తిచేస్తామని తెలిపారు. టీఆర్ఎస్తోనే భద్రాచలం అభివృద్ధి సాథ్యమన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య, దిశ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, సుధాకర్, పుల్లారావు, ఎండీ బషీర్, బీసీ సెల్ అథ్యక్షులు రామకృష్ణ, అధికార ప్రతినిధి రాంబాబు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.