Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
ప్రైవేటు కంపెనీల మైక్రోఫైనాన్స్ సంస్థలు గ్రామాలలో రుణాల పేరుతో పంజా విసురుతున్నాయి. గ్రామాలలోని మహిళలతో గ్రూపులను ఏర్పాటు చేసి రుణాలు ఇస్తున్నారు. వారి నుండి అధిక వడ్డీల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు నెలవారి టార్గెట్లు పెడుతూ, అధిక సమయం పని చేపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఉద్యోగి సంస్థ వేధింపులను తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మధిర నియోజకవర్గ కేంద్రంగా కొన్ని ఫైనాన్స్ సంస్థలు పని చేస్తున్నాయి. ఈ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రతిరోజు బోనకల్ మండలంలోని గోవిందాపురం ఎల్, గార్లపాడు, రావినూతల, బోనకల్, లక్ష్మీపురం, పెద్ద బీరవల్లి తదితర గ్రామాలలో ఆ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆ సంస్థ నుండి రుణం పొందడానికి అనేక షరతులను విధిస్తుంది. ఒక్కో గ్రూప్ కి ఐదు నుండి పది మంది కేవలం మహిళలు మాత్రమే ఉండాలి. గ్రూపు నుంచి ఒక్కొక్క మహిళకు 40 వేల రూపాయలను ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణంగా ఇస్తారు. 40 వేల రూపాయల రుణం తీసుకున్న మహిళ ప్రతి నెల 2,195 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా 24 నెలల పాటు క్రమం తప్పకుండా చెల్లించాలి. ఈ విధంగా 40 వేల రూపాయల రుణం తీసుకున్న మహిళ రెండు సంవత్సరాలకు గాను 52,680 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణానికి వడ్డీ సుమారు వందకు పది రూపాయల నుండి 15 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. గ్రూపులో ఏ సభ్యురాలైన అనుకున్న సమయానికి రుణం చెల్లించలేని ఎడల ఆ గ్రూపులోని మిగిలిన సభ్యులందరూ కలిసి ఆమె అప్పు కూడా చెల్లించాల్సి ఉంది. గ్రామాలలో పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని మైక్రోఫైనాన్స్ సంస్థలు రుణాల ముసుగులో అధిక వడ్డీలను వసూలు చేస్తున్నారు. దీంతో రుణాలు తీసుకున్న మహిళలు తమ ఆర్థిక అవసరాల కోసం ఈ సంస్థల నుండి రుణాలు తీసుకొని అధిక వడ్డీలతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి గ్రామాలలో అవసరమైన సందర్భాలలో నగదు పుట్టడం లేదని, భారమైనా తాము ఆ సంస్థల నుండి తమ అవసరాల కోసం అధిక వడ్డీ అయినప్పటికీ రుణాలు తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందపురం ఎల్ గ్రామంలో మూడు గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్రూపులో ఏడుగురు ఉన్నారు. ఈ మూడు గ్రూపులకు గాను 21 మందికి 8.40 లక్షల రూపాయలు ఫైనాన్స్ ఇచ్చారు. లక్ష్మీపురం గ్రామంలో మూడు గ్రూపులుగా ను 21 మందికి 8.4 లక్షలు రుణంగా ఇచ్చారు. గార్లపాడు గ్రామంలో ఎనిమిది మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేసి 3.20 లక్షల రూపాయల ఫైనాన్స్ ఇచ్చారు. రామాపురం గ్రామంలో 14 మందితో రెండు గ్రూపులు ఏర్పాటు చేసి, 5.60 లక్షలను రుణంగా ఇచ్చారు. ఈ విధంగా మండలంలోని అనేక గ్రామాలలో ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇచ్చారు.
ఉద్యోగస్తులతో వెట్టిచాకిరీ
ఇది ఇలా ఉండగా ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సంస్థ యాజమాన్యం ఈ ఉద్యోగులతో పని చేయించుకుంటుంది. రోజుకి సుమారు 15 నుండి 18 గంటలపాటు గ్రామాలలో ఈ సంస్థ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. నెలవారీగా వారికి టార్గెట్లు పెట్టి, ఆ టార్గెట్ను పూర్తి చేయలేకపోయిన వారిని వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. రుణ వసూళ్ల కోసం సంస్థ ఉద్యోగులు వచ్చే సమయానికి రుణం తీసుకున్న సదరు మహిళలు గడగడ లాడు కుంటూ వారు నిర్దేశించుకున్న స్థలానికి నిర్ణయించుకున్న సమయానికి కచ్చితంగా ప్రతి మహిళ రావాల్సిందే. ఎవరైనా ఒకవేళ రానియెడల ఆమెపై జరిమానా విధిస్తారు. ఈ విధంగా పైనాన్స్ కంపెనీలా హవా గ్రామాలలో కొనసాగుతుంది సంస్థ కార్యక్రమాల గురించి ఇతరులకు ఎవరికీ ఎట్టి పరిస్థితులలోనూ చెప్పటానికి వీలు లేదు. ఆ విధంగా సంస్థ వారిపై షరతులు విధిస్తూ తమ కార్యక్రమాలను గ్రామాలలో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
వేధింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య
సంస్థ వేధింపుల కారణంగానే మధిర కేంద్రంగా నిర్వహిస్తున్న ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తల్లాడ మండలం కలకోడిమ గ్రామానికి చెందిన ఆదూరి సన్నీ అక్టోబర్ 9వ తేదీన ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సన్నీ ఒక నెలకు సంబంధించిన 30 వేల రూపాయలను తన అవసరాల కోసం వినియోగించుకున్నాడు. ఈ విషయం తెలిసిన సంస్థ 30 వేల రూపాయలు చెల్లించాల్సిందే పట్టుబట్టింది. దీంతో బ్రాంచ్ మేనేజర్ తోపాటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ కలిసి ఆ డబ్బులను సంస్థకు చెల్లించారు. సన్నీకి రెండు నెలల వేతనాలకు సంబంధించి 40 వేల రూపాయలు రావాల్సి ఉంది. జీతం రాగానే ఆ డబ్బులు చెల్లిస్తానని సహచర ఉద్యోగులకు చెప్పాడు. అయితే రెండు నెలలకు సంబంధించిన వేతనాన్ని చెల్లించి ఖాతాను హౌల్డ్లో పెట్టారు. దీంతో తనకు చెల్లించవలసిన డబ్బులు సహ ఉద్యోగస్తులకు చెల్లించ లేకపోవటం తన మోటార్ సైకిల్ తీసుకోవటం తదితర కారణాలతో సన్నీ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సోషల్ మీడియా ద్వారా తన బంధువులకు సమాచారం ఇస్తూ సంస్థ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఆ సంస్థ బ్రాంచ్ మేనేజర్ మొదలు రీజనల్ మేనేజర్ వరకు తన చావుకు కారణం అని, వారిని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి పెట్టవద్దని కోరాడు. మృతుని బంధువులు ఖమ్మంలో గల ఆ సంస్థ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఏడాది సెప్టెంబరు 9వ తేదీనే సన్నీకి వివాహం అయింది. ఈ సంఘటన మధిర నియోజకవర్గంలో సంచలనంగా మారింది.