Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టం వలన గ్రామాలలో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య చెక్కులపై సంతకాలు కోసం వార్ నడుస్తోంది. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. బోనకల్ మండలం లో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 22 గ్రామ పంచాయతీలలో సిపిఎంకు 5, కాంగ్రెస్‌కు 8, టిఆర్ఎస్కు 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిపిఎంకు 8, కాంగ్రెస్‌కు 7, టిఆర్ఎస్కు 5, టిడిపికి 1 సిపిఐకి 1 ఉప సర్పంచులు ఉన్నారు. ఒకే పార్టీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచులు టిఆర్ఎస్కు 4, సిపిఎంకు రెండు, కాంగ్రెస్‌కు నాలుగు పంచాయతీలు ఉన్నాయి. 12 పంచాయతీలలో సర్పంచ్, ఉప సర్పంచ్ వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్‌కి కట్టబెట్టారు. గతంలో ఉన్న పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ కు జాయింట్ చెక్ పవర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉండేది. సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి, పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడంలో పెద్దగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఒక ప్రజాప్రతినిధి మరొకరు ఉద్యోగి కావడంతో జాయింట్ సంతకాల విషయంపై ఎటువంటి వివాదాలు తావు లేకుండా గ్రామ పంచాయతీల పరిపాలన సాఫీగా సాగింది. సర్పంచ్ చేసిన అభివృద్ధి పనులకు లేదా గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలవారీగా జీతాలు చెల్లించే చెక్కుపై తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎటువంటి కొర్రీలు లేకుండా జాయింట్ సంతకం చేసేవారు. ఒకవేళ పంచాయతీ కార్యదర్శి జాయింట్ సంతకం చేయకపోతే సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందనే భయంతో తప్పనిసరిగా జాయింట్ సంతకం చేసేవారు. దీంతో చెక్కుల జాయింట్ సంతకంపై వివాదాలు ఉండేవికావు. ఎక్కడో ఒకచోట చిన్నచిన్న జరిగిన అవి వెంటనే అధికారులు రంగంలోకి దిగి పరిష్కారం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు వర్సెస్ ఉప సర్పంచ్ల మధ్య జాయింటు సంతకాలపై వార్ నడుస్తోంది. సర్పంచులు అభివృద్ధి పనులు చేసిన తర్వాత సంబంధిత అధికారులు ఎంబిలు చేస్తారు. ఆ ఎంబిలు ఆధారంగా గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్ చెక్కులు మార్చుకోవాల్సి ఉంది. ఇక్కడే అసలు కథ ప్రారంభ మవుతుంది. జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్‌కి ఉండటంతో అనేక గ్రామ పంచాయతీలలో సర్పంచులకు తలనొప్పిగా మారింది. గ్రామ పంచాయతీలలో సాధారణంగా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచనలు చేస్తున్నారు దీనివలన పాలకవర్గంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం ఐదు, ఆరు పంచాయతీలలో మాత్రమే జాయింట్ సంతకాలపై వివాదాలు లేవు. మిగిలిన అన్ని పంచాయతీలలో సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య వార్ నడుస్తూనే ఉంది. కొన్ని గ్రామాలలో ఆ వివాదాలు రోడ్డున కూడా పడ్డాయి. ఒకే పార్టీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ లుగా ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా ఉప సర్పంచ్ చెక్కుల పై సంతకాలు చేయకుండా సర్పంచులకు చుక్కలు చూపిస్తున్నారు. అనేక గ్రామాలలో కొంతమంది ఉప సర్పంచులు వివిధ రకాల కొర్రీలతో సంతకాలు పెట్టకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్న తమకు నెలల తరబడి చెక్కుల మీద సంతకాలు పెట్టకపోతే ఆర్థికంగా తాము ఎంతో నష్టపోతున్నామని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు నెలవారీగా జీతాలు చెల్లించే చెక్కుల విషయంపై కూడా కొంతమంది ఉప సర్పంచులు కొర్రీ పెడుతున్నారంటే గ్రామ పంచాయతీలలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. దీనికంతటికీ కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని పలువురు ప్రజా ప్రతినిధులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.