Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాద్రికి ఆర్టీసీ బస్సులో ఆర్.నారాయణ మూర్తి
అ ప్రజల యోగక్షేమాలు అడిగి
తెలుసుకున్న దర్శకనిర్మాత
నవతెలంగాణ-భద్రాచలం
పీపుల్ స్టార్ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి బుధవారం భద్రాచలం ఆర్టీసీ బస్సులో సాదాసీదాగా వచ్చారు. బుధవారం భద్రాచలంలో రైతన్న సినిమా ప్రచారం నిమిత్తం ఆయన ప్రజలతో ముఖాముఖి మాట్లాడేందుకు భద్రాద్రి వచ్చారు. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఆయన ఆర్టీసీ బస్సు ద్వారా భద్రాచలానికి చేరుకున్నారు. భద్రాచలస్త్ర రావటానికి ఓ వాహనాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆయన తిరస్కరించి, తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించడమే తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొనడమే కాకుండా సామాన్య పౌరునిగా భద్రాద్రి చేరుకున్నారు. ఈ సమయంలో భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన బస్సు దిగుతుండగా భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో కళాకారులు అల్లం నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ సమయంలో తొలుత సిపిఎం కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటంతో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి తీసుకువచ్చేందుకు తన ద్విచక్ర వాహనం ద్వారా ఆయనను సిపిఎం కార్యాలయంనకు తీసుకువచ్చారు. తొలుత ఆర్.నారాయణ మూర్తి తాను ద్విచక్రవాహనంపై రానని, ఆటో ద్వారా సిపిఎం కార్యాలయానికి వస్తానని పేర్కొన్నప్పటికీ, అనంతరం వెంకటరెడ్డి ద్విచక్రవాహనంపై సీపీఐ(ఎం) కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. తొలిసారిగా భద్రాచలం ఆయనను చూసేందుకు సిపిఎం కార్యాలయానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరినీ పలకరిస్తూ అమ్మ బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, అక్క బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, అన్నా బాగున్నారా అంటూ అందరినీ పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఇక్కడకు వస్తున్న విషయం తెలుసుకొని అతి తక్కువ సమయంలో తనను చూసేందుకు వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎర్రజెండా, ఎర్రజెండా ఎన్నీయల్లో పాట ఉన్నంతవరకు ప్రజలలో బ్రతికి ఉంటా..
చీమల దండు సినిమాలోని ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయల్లో అనే పాట ఉన్నంత వరకు తాను ప్రజల గుండెల్లో ఉంటానని ఆర్.నారాయణమూర్తి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ పాట తనకు ఓ మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. సీపీఐ(ఎం) కార్యాలయంనకు వచ్చిన అందరితో ఆయన వ్యక్తిగతంగా ఫోటోలు దిగుతూ అభిమానులను ఆయన అలరించారు. ఈ సందర్భంగా రైతన్న సినిమాలో ఓ పాట పాడి ఆయన ప్రజలను ఆలరించారు.