Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడంలేదు. డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతి పనికి ఒక రేటు కట్టి ఆ డబ్బు ముట్టవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో బుధవారం ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి జూనియర్ అసిస్టెంట్ రవీందర్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన సాదం శ్రీనివాస్ తనతో పాటు కూతురికి కుల ధ్రువీకరణ పత్రం కోసం 17 సెప్టెంబర్ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్ కోసం జూనియర్ అసిస్టెంట్ రవీంద్ర రావును దరఖాస్తు దారుడు కలవగా రూ.28 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని అమ్మాయిపై చదువుల నిమిత్తం దరఖాస్తు పెట్టుకున్నానని ప్రాధేయపడ్డాడు. వినకపోవడంతో బాధితుడు ఏసీబీ కార్యాలయం ఖమ్మంలో ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో జూనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. అతడి దగ్గర రూ.6 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.