Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఈ నేపధ్యంతోనే 'రైతన్న' సినిమా తీశా
అ విప్లవ నటుడు ఆర్. నారాయణమూర్తి
నవతెలంగాణ- సత్తుపల్లి
భారతదేశంలో వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే పరిస్థితులను పాలకులు తీసుకొస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు గనక అమలైతే దేశంలో రైతు అనేవారు ఎవరూ ఉండరని ప్రముఖ విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం సత్తుపల్లి వచ్చిన నారాయణమూర్తి స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నేపధ్యంతోనే తాను 'రైతన్న' సినిమాను చిత్రీకరించడం జరిగిందన్నారు. ఈ సినిమాను చూస్తే నూతన వ్యవసాయ చట్టాలతో రైతన్నల స్థితిగతలు ఎలా మారతాయో అర్థమయ్యేలా చిత్రీకరించడం జరిగిందన్నారు. 36 యేండ్లుగా అనేక సినిమాలు తీసిన నేను పలానా సినిమా చూడండి అని చెప్పిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు రైతన్న సినిమాను చూడమంటూ ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మేం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదించండి. రైతుల పాలిట అవి వరాలని, ఒకే మార్కెట్, ఒకే దేశం అంటూ, ప్రపంచంలో మీరూ నిలబడాలంటూ మాయమాటలను కేంద్రప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. అవి వరాలు కాదు, మా పాలిట శాపాలంటూ అన్నదాతలు గత 9 నెలలుగా ఢిల్లీ నడిబొడ్డున పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే మోడీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. 600 మంది రైతులు చనిపోతే మోడీకి కనికరం లేకుండా పోయిందన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులపైకి కార్లను ఎక్కించి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, కేరళ, ఢిల్లీ, అస్సోం, ఏపీ ప్రభుత్వాలు రైతులకు పలు రకాలుగా లబ్ధిచేకూరే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆ చట్టాలు గనక అమలైతే 24 గంటల ఉచిత విద్యుత్
ఉండదన్నారు. మోడీ ప్రభుత్వం పంతాలకు పోకుండా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వానిధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. లేకుంటే వ్యవసాయరంగం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తే రైతులు దేశంలో ఉండరని, ఏ జంతు ప్రదర్శన శాలలో అదిగో పులి, ఇదిగో కోతి, అడుగో రైతు అనే చూసే పరిస్థితులు ఉంటాయన్నారు. రైతు ఉద్యమానికి ఎర్రజెండాల బిడ్డలు పూర్తి మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రైతన్న సినిమా ఈనెల 22న ఉమ్మడి జిల్లాలో పలు పట్టణాల్లో రిలీజ్ అవుతుందన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి, రైతులు, ప్రజలు సినిమాను చూసేలా కృషి చేయాలని నారాయణమూర్తి వామపక్ష పార్టీల నాయకులను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు, రైతుసంఘ జిల్లా నాయకులు రావుల రాజబాబు, సీఐటీయూ జిల్లా నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, మల్లూరు చంద్రశేఖర్, ఐద్వా నాయకురాళ్లు జాజిరి జ్యోతి, తిగుళ్ల లక్ష్మి, పాకలపాటి ఝాన్సీ, కుమారి, భాగ్యమ్మ పాల్గొన్నారు.