Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అంబరానంటిన బతుకమ్మ సంబురాలు
అ తెలంగాణ సంస్కృతికి
అద్దంపట్టిన ఆడపడుచులు
అ పూల పల్లకిలో సాగిన బతుకమ్మలు
నవతెలంగాణ-కొత్తగూడెం
పోయిరావమ్మా...పోయిరావమ్మా....బతుకమ్మ అంటూ అంబరానంటిన బతుకమ్మ సంబురాలు నేత్రానందాన్ని కలిగించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత తొమ్మిది రోజులు చూడముచ్చటగా సాగిన బతుకమ్మ సంబురాలు గురువారం రాత్రితో ముగిశాయి. జిల్లాలోని పల్లెపల్లె...గ్రామ గ్రామాన అడపడుచులు బతుకమ్మ చివరిరోజు కావడంతో సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వాడవాడాలా...తీరోక్క పూల పల్లకీలో బతుకమ్మలు సాగిపోయారు. తీరోక్కపూలతో పెద్దగా అలంకరించిన బతుకమ్మలను ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసి మహిళలు, యువతులు ఒకదగ్గర చేరి బతుకమ్మల చుట్టు తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడీ, పాడారు. కొన్ని ప్రాంతాల్లో కోలాట నృత్యాలతో మహిళలు, యువతులు లయబద్దంగా కదం..కదం కలిపి సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ కోలాటమేస్తూ చప్పట్లతో ఆడిపాడిన సంబురాలు అంబరానంటాయి. పోయిరావమ్మా....బతుకమ్మ పోయిరా...అంటూ గ్రామా ల్లోని చెరువు...వాగులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. భద్రాచలం గోదావరి నది పరివాహక ప్రాంతాల వారు పవిత్ర గోదావరిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గత ఏడాది కంటే ఈ సారి కోవిడ్ ప్రభంజనం అంతగా లేకపోవడంతో పెద్దఎత్తున ఆడపడుచులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గుండాల : మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆటాపా టలతో సంతోషంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగను గురువారం మండలంలోని అన్ని గ్రామాలలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అనంతరం సల్లంగా చూడు తల్లి సద్దుల బతుకమ్మ అంటూ వెళ్లిరా బతుకమ్మ మల్లి రావమ్మా అని సాగనంపారు.
దుమ్ముగూడెం బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటు సంబురంగా సాగాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు గురువారం సద్దుల బతుకమ్మతో సంబురంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలతో పూజలు అందుకున్న గౌరమ్మను పూల బతుకమ్మతో పర్ణశాల గోదావరితో పాటు మండలంలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న చెరువుల్లో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. కాగా పర్ణశాలలో జరిగిన బతుమ్మ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణ మూర్తితో పాటు పర్ణశాల సర్పంచ్ వరలకీë పాల్గొన్నారు.
భద్రాచలం : భద్రాచలంలో గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రామాలయ పరిసర ప్రాంతంలో ఈ సంబరాలు నిర్వహించారు. భద్రాచలంలోని అన్ని కాలనీలకు చెందిన బతుకమ్మలను తీసుకుని వచ్చి ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. బుల్లి తెర యాంకర్ మేఘణ ఆధ్వర్యంలో ఈ సంబురాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇల్లందు : సద్దుల బతుకమ్మ పట్టణంలో గురువారం సింగరేణి, మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ జెకె కాలని, చెరువు కట్ట, సత్రం ఏరియా, వివిధ వార్డులలో రంగురంగుల లైట్లు విద్యుద్దీపాలతో అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో వచ్చి ఆటలు ఆడి పాటలు పాడారు. సింగరేణి కాలరీస్, ఇల్లందు ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు, నియోజక వర్గ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ చైర్మెన్ డి.వెంకటేశ్వర్లు, సేవ అధ్యక్షురాలు మల్లెల నరసవల్లి, జ్యోతి సాంప్రదాయ బద్దంగా ప్రారంబించారు. కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ పూలను పేర్చుకుని పాడి ఆడి గ్రామ శివారులోని చెరువు దగ్గర ఘనంగా కలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు విజయ లలిత, జానకమ్మ, స్వరూప, సరిత, స్వరూప, ఉమాదేవి, హైమావతి, రూప, దేవి, శైలజ, భవాని, సుజాత, ప్రియాంక, ప్రశాంతి, సంధ్యారాణి, మౌనిక పాల్గొన్నారు.