Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామీణాభివృద్ధి ఎం.విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని తెల్దారుపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి, బృహత్ ప్రకృతి వనాలను గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడిందని, ఇప్పటికే మొక్కలు నాటడం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా పనులు కొనసాగటం సరైనది కాదన్నారు. వెంటనే పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీఓ శ్రీదేవిని ఆదేశించారు. రెండు రోజుల్లో మొక్కలు నాటడం ప్రారంభించాలని, ఈ వనాల్లో పండ్లు, పూల మొక్కలతో పాటు అటవీ, రెవెన్యూ ప్లాంట్లను కూడా నాటాలని సూచించారు.మండల వ్యాప్తంగా ఇంకా పల్లె ప్రకతి వనాలు,నర్సరీలు వెంటనే పూర్తి చేయాలని ప్రైవేట్ స్థలాల్లో ఉన్న నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని ఆదేశించారు. మండలంలో పనులు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో లక్ష్యాలను పూర్తి చేయాలని, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీదేవి, తెల్దారుపల్లి పంచాయతీ కార్యదర్శి రాధ తదితరులు పాల్గొన్నారు.