Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పూలజాతర కోలాహలంగా సాగింది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు తొమ్మిది దినముల పాటు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను ఆరాధించారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుక శోభాయమానంగా సాగింది. 'పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా...మళ్లచ్చే ఏడు మళ్లీ రావమ్మా...' అంటూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలకు దూరమైన మహిళలు ఈ ఏడాది ఎంతో ఆనందంగా సంబురాలు చేసుకున్నారు. వాడవాడల నుంచి బతుకమ్మలను చేతపట్టుకుని గుళ్లూగోపురాలు, నీటి వనరుల సమీపంలో ఆడిపాడిన ఆడపడుచులు దస్తీబిస్తీలు గీసి, వాయినాలు ఇచ్చుకొని సందడిగా కనిపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పల్లెపట్టణం తేడాలేకుండా సద్దుల బతుకమ్మ సంబురాలు చేశారు. ఖమ్మం గాంధీచౌక్, కమాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి శోభాయాత్రగా గుంటు మల్లేశ్వర క్షేత్రం, నయాబజార్ కళాశాల గ్రౌండ్‌కు చేరారు. ప్రకాశ్‌నగర్, ఎన్నెఎస్పీ కెనాల్ సమీపంలోనూ...చెరువులు, వాగుల చెంత బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. బతుకమ్మ శిగన గౌరమ్మను ఉంచి..జ్యోతులు వెలిగించి గంగమ్మ ఒడికి చేర్చారు. నీటి అలలపై దీపపు మిరుమిట్ల మధ్య వేడుకలకు ముగింపు పలికారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) ఆధ్వర్యంలో మహిళా రక్షణను కాంక్షిస్తూ బతుకమ్మలాడారు. ఆడబిడ్డల సంరక్షణకు సంబంధించిన ఫ్లకార్డులను ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు బతుకమ్మ ముగింపుతో పాటు దసరా శుభాకాంక్షలు తెలిపారు.