Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి
అ కేసీఆర్‌వి మాయమాటలు
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- బోనకల్
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటుగా విమర్శించారు. మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో పాపినేని రమాదేవి సంతాప సభను సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. తొలుత రమాదేవి చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం పూలమాలవేసి నివాళ్లర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో పని చేయడమంటే చాలా కఠినంగా నిబంధనలు ఉంటాయన్నారు. కానీ రమాదేవి తన కుటుంబాన్ని మొత్తాన్ని సిపిఎంలో పని చేసే విధంగా తీర్చిదిద్దారన్నారు. పదిమందికి భారంగా మారే కంటే పదిమందికి ఉపయోగపడే విధంగా, పని చేసే విధంగా తన కుటుంబాన్ని రమాదేవి తీర్చిదిద్దరన్నారు. కమ్యూనిస్టు కార్యకర్త సమాజ మార్పు కోసం కృషి చేయాలన్నారు. ఆ విధంగా రమాదేవి కషి చేసిందన్నారు. రమాదేవి చనిపోయిన తర్వాత కూడా కళ్లు దానం చేయటం పట్ల ఆ కుటుంబాన్ని అభినందించారు. చనిపోయిన తర్వాత స్వర్గం, నరక లోకాలు ఉంటాయని చెబుతారని ఇవన్నీ అభూత కల్పన అన్నారు. అనేకమంది కమ్యూనిస్టులు సమాజ మార్పు కోసం పని చేస్తుండగా ప్రస్తుత రాజకీయాలు ప్రమాదకరంగా, ఆందోళనకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద దేశాలు ఒకప్పుడు ప్రపంచంలో పెత్తనం చేశాయని, ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలందరూ కమ్యూనిస్టు దేశాల వైపు చూస్తున్నారన్నారు. కరోనా పుట్టిన చైనా దేశంలో కరోనా కేసులు 90000 నమోదు కాగా భారతదేశంలో నాలుగు కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. కమ్యూనిస్టు దేశాలలో మాత్రమే కరోనా అరికట్ట కలిగాయని, పెట్టుబడిదారీ రాజ్యాలైన అమెరికాతో సహా అనేక దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు అన్నారు. అమెరికాలో 6 లక్షల మంది మత్యువాత పడ్డారని తెలిపారు. కమ్యూనిస్టు దేశాల్లో కరోనా కట్టడానికి పెట్టుబడి దారి రాజ్యాలలో కరోనా కట్టడి చేయకపోవడానికి కారణం కమ్యూనిస్టు దేశాలలో వైద్యరంగం ప్రభుత్వ ఆధీనంలో ఉందని పెట్టుబడిదారీ దేశాలలో వైద్య రంగం ప్రైవేటు రంగంలో ఉండటమే అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సాయంత్రం ఏమి మాట్లాడతారో ఉదయం ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు పథకం గురించి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారని, ఆ సమావేశంలో ముందుగా తననే మాట్లాడాలని కోరారని తెలిపారు. ఏడేళ్ల క్రితం గిరిజనులకు, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని వాగ్దానం చేసి నేటి వరకు ఎందుకు అమలు చేయలేదని తాను నిలదీసినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల వారికి దళిత బంధు అమలు చేయాలని తాను సూచించినట్లు తెలిపారు. రైతులు చనిపోతే రైతు బీమా వస్తుందని సెంటు భూమి లేని నిరుపేదలు చనిపోతే మాత్రం ప్రభుత్వం ఏ బీమా ఇవ్వటం లేదని ఇది ఎక్కడ న్యాయం అని తాను నిలదీసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తానని తెలిపారని, కానీ సమావేశం అనంతరం దళిత బంధు హుజురాబాద్‌కే పరిమితం చేశారని విమర్శించారు.
నిర్బంధాల నుంచే ఉద్యమాలు పడతాయి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నిర్బంధాల నుంచే ప్రజా ఉద్యమాలు పడతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. రమాదేవి తన కుమారులను సిపిఎంలో చురుకైన పాత్ర నిర్వహించే విధంగా తయారు చేశారన్నారు. మూఢ నమ్మకాలకు భిన్నంగా ఆధునిక పద్ధతులు పాటిస్తూ రమాదేవి సంతాప సభ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు నిర్వహించడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
రమాదేవి పార్టీ కార్యకర్తలకు తల్లిలా వ్యవహరించింది: సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు
పాపినేని రమాదేవి ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొన్న సిపిఎం కార్యకర్తలకు ఓ తల్లిలా వ్యవహరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు కొనియాడారు. సిపిఎం తూటికుంట్ల గ్రామ శాఖ అన్ని కార్యక్రమాలలో అగ్రభాగాన ఉందన్నారు. మూఢనమ్మకాల సాంప్రదాయాలకు భిన్నంగా రమాదేవి కార్యక్రమాన్ని కుటుంబం మొత్తం నిర్వహించడం సమాజానికి ఆదర్శమన్నారు.
సంతాప సభ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న వెంకటేశ్వరరావు సిపిఐ నాయకులు బ్రహ్మం టిడిపి వల్లంకొండ వెంకట్రామయ్య ఖమ్మం నేత్ర నిధి కార్యదర్శి రాయపూడి అనంత పద్మనాభం, ఆ సంస్థ సభ్యులు హనుమంతరావు రమాదేవి కుమారుడు పాపినేని రామనర్సయ్య మాట్లాడారు.
ఈ సభ లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ , బుక్యా వీరభద్రం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ ,జిల్లా నాయకురాలు ఝాన్సీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్ , బొంతు రాంబాబు, చింతలచెరువు కోటేశ్వరరావు, తాత భాస్కర్ రావు ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు దేవేందర్ ఎంపీపీ కంకణాల సౌభాగ్యం మాజీ ఎంపీపీ లు తుళ్లూరు రమేష్ , చిట్టిమోదు నాగేశ్వరరావు, కొమ్ము శ్రీనివాసరావు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మద్దాల ప్రభాకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కోలేటి నాగేశ్వరరావు, ముత్తారపు గిరి ఐలు రాష్ట్ర నాయకులు ఏడు నూతల శ్రీనివాసరావు, దిరిశాల జగన్ మోహన్ రావు సిపిఎం సీనియర్ నాయకులు యనమద్ది సత్యనారాయణ, కిలారు తిరుపతయ్య చింతకాని, వైరా రూరల్, మధిర రూరల్ సిపిఎం మండల కార్యదర్శులు మడిపల్లి గోపాలరావు, తోట నాగేశ్వరరావు, మందా సైదులు తూటికుంట్ల సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ మాజీ ఎంపిటిసి గుమ్మ ముత్తారావు సిపిఎం శాఖ కార్యదర్శులు పాపినేని రమేష్ ,పాపినేని అప్పారావు, పాపినేని వెంకటరావు మండల కమిటీ సభ్యులు నోముల పుల్లయ్య ఎంపీటీసీలు జొన్నలగడ్డ సునీత, కర్లకుంట దేవమణి, ముక్కపాటి అప్పారావు వివిధ గ్రామాల సిపిఎం శాఖా కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రమాదేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.