Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బూరుగు పాడును దత్తత తీసుకుంటా
అ మౌలిక సదుపాయాల
కల్పనకు కృషి చేస్తా
అ జన్మ స్థలం రుణం తీర్చుకుంటా
అ హైకోర్టు న్యాయవాది, సీవి సతీష్ కుమార్
నవతెలంగాణ-చర్ల
ఉన్న ఊరును, కన్న తల్లిని మర్చిపోయిన వారు తన దృష్టిలో మనుషులే కాదని, తాను జన్మించిన గడ్డపై పేద ప్రజలకు సేవచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ప్రముఖ హైకోర్టు న్యాయవాది చింతలచెరువు సతీష్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన బూరుగుపాడు గ్రామంలో నిరుపేదలైన గిరిజన కుటుంబాలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి, ఆయన మాట్లాడారు. సీనియర్ పౌరులు చింతూరు వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తహసీల్దార్ ఈరెల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాది సతీష్ కుమార్ తాత చింతలచెరువు వెంకటాద్రి స్వాతంత్ర ఉద్యమంలో ఈ ప్రాంత గిరిజన హక్కుల కోసం అహింసా మార్గంలో పోరాడిన యోధుడు అని, తండ్రి సివికె రావు ఆయన లక్షణాలు పుణికిపుచ్చుకున్నారని అన్నారు. ఈ గడ్డపై జన్మించిన సతీష్ కుమార్ హైకోర్టు న్యాయవాదిగా తీరికలేని సమయం గడుపుతున్నా తను పుట్టిన ఊరు పై మమకారం తీరక, తన తాత, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయాల కోసం పరితపించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని తెలిపారు. సతీష్ కుమార్ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత పేద ప్రజల కోసం, గిరిజన పల్లెల అభివృద్ధి కోసం పలువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేల ద్వారా గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయించిన ఘనత దక్కుతుందని కొనియాడారు. చర్ల మేజర్ గ్రామ పంచాయతీకి పార్లమెంటు సభ్యులు కెవిపి రామచంద్రరావు నిధుల నుండి రూ.ఐదు లక్షలతో అంతిమయాత్ర రధాన్ని సమకూర్చడం పట్ల అభినందించారు. అలాగే ప్రతి సంవత్సరం దసరా, సంక్రాంతి పండుగకు గిరిజన పల్లెలను ఎంపిక చేసుకొని రగ్గులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం హైకోర్టు న్యాయవాది సతీష్ కుమార్ మాట్లాడుతూ తాను జన్మించిన గడ్డపై పేద ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలనేది ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ గ్రామ గిరిజనులు ఎంతో వెనుకబడి అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారని, కనీస రహదారి సౌకర్యాలు కూడా లేని పరిస్థితిలో జీవించడం ఎంతో బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ముఖ్య అతిథి తహసీల్దార్‌ను శాలువా కప్పి సత్కరించి అడ్వకేట్ సతీష్ జ్ఞాపిక అందించారు .ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ గ్రామ మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నల్లపు దుర్గాప్రసాద్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి, తడికల లాలయ్య, నీలి నందు బాబు, ఎస్.కె షాజహాన్, సీనియర్ పాత్రికేయులు దొడ్డా ప్రభుదాస్ తదితరులు మాట్లాడిన ఈ సమావేశంలో ఆర్ఐ నళీన్ కుమార్, ఎర్రంకి ఉదయ ప్రభాకర్, ఎస్.డి.అజీజ్, గాలి గోపి, కిషోర్, చీమకుర్తి సాయిచరణ్, నరెడ్ల రవితేజ, గొగ్గురి పూర్ణచంద్ర రావు, ఉద్దవోలు రాము పాత్రికేయులు గిరి, రుద్ర, తోటమల్ల రమణమూర్తి, దొడ్డి హరినాగ వర్మ, కిరణ్, గ్రామస్తులు సోమయ్య, గంగయ్య, నందా, అడమయ్య, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.