Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డబుల్ ఇళ్ల ప్రవేశమే నిజమైన దసరా
అ పేదల ఆత్మగౌరవానికి
ప్రతీక కేసీఆర్ టవర్స్
అ 1004 మంది లబ్దిదారులకు పట్టాల
పంపిణీ, గృహ ప్రవేశాల సందర్భంగా
మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నగరంలోని కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పేద ప్రజల ఆత్మ గౌరవనానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్పష్టం చేశారు. టేకులపల్లిలో రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,004 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం పట్టాలు పంపిణీ చేసి, గృహప్రవేశాలు చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒకేరోజు వెయ్యి మందికి పైగా పేదలు డబుల్ బెడ్ రూమ్ గహప్రవేశాలు చేయడం నిజమైన దసరా అని మంత్రి పేర్కొన్నారు. విజయానికి దసరా పండుగ సుచికైతే... పేదరికం పై అభివద్ధి సాధించిన విజయమే డబుల్ బెడ్ రూమ్ గృహప్రవేశాలని మంత్రి అభివర్ణించారు. 2017 సంవత్సరంలో 400 ఇళ్లతో మొదలు పెట్టి 11 ఎకరాల విస్తీర్ణంలో 1,250 గృహాలు ఒకేచోట నిర్మించుకున్నామన్నారు. రూ.15 లక్షల విలువైన ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే డబుల్ బెడ్ రూమ్ పథకం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీపావళి నాటికి మరో 250 మందికి డబుల్ బెడ్ రూమ్ లను అందిస్తామన్నారు. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీగా ఏర్పాటు చేసుకున్న కె.సి.ఆర్. టవర్స్ లో అంతర్గత రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాలు, మిషిన్ భగీరథ తాగునీరు , అంగన్ వాడి కేంద్రం, సూపర్ బజార్, పీహెచ్ సీ, ఓపెన్ జిమ్, పిల్లల ఆటవిడుపు స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. అతి త్వరలోనే పోలీసు అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్దతిన పూర్తి పారదర్శకతతో జరిగిందన్నారు. ఇళ్ళు రానివారు బాధ పడవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సొంత ఇంటి జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలను అందించనున్నట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకుపల్లిలో 48 బ్లాక్ లలో 1004 గహప్రవేశాలు ఒకేసారి చేసుకోవడంతో పేదల చిరకాల వాంఛ నెరవేరిందని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు దసరా అతిపెద్ద పండుగని, ఆ రోజునే గృహప్రవేశాలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖమంత్రి ఆదేశాల మేరకు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశామన్నారు. ఎటువంటి సమస్యలున్నా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సత్వరమే సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ గహ సముదాయాల నిర్మాణాలు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, సహకరించిన ప్రతిఒక్కరినీ కలెక్టర్ అభినందించారు.