Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ త్రీటౌన్ 7వ మహాసభలో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని బోస్ బొమ్మ సెంటర్ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్‌లో ఆదివారం సీపీఐ(ఎం) త్రీ టౌన్ కమిటీ 7వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను నిలువునా దోపిడీ చేసి నిత్యావసర ధరలను పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాలపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ మహాసభలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టపెడుతుందని ఘాటుగా విమర్శించారు. అనేక మంది కమ్యూనిస్టులు సమాజ మార్పు కోసం పని చేస్తుండగా ప్రస్తుత రాజకీయాలు ప్రమాదకరంగా, ఆందోళనకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సాయంత్రం ఏమి మాట్లాడతారో ఉదయం ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దళిత బంధు హుజురాబాద్‌కే పరిమితం చేశారని విమర్శించారు. ఈ మహాసభకు వజినేపల్లి శ్రీనివాసరావు, యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, పత్తిపాక నాగసులోచన, యర్రా సుకన్య, అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, యర్రా శ్రీనివాసరావు, తుశాకులు లింగయ్య పాల్గొన్నారు.