Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం పంచాయతీ బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ట్రాక్టర్లో శనివారం రాత్రి 10 గంటల వరకు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. భారీ వర్షం ప్రారంభం కావడంతో దుర్గమాత విగ్రహం ఉన్న ట్రాక్టర్ను గంధసిరి వైపు నిమజ్జనానికి బయలుదేరి వెళ్ళింది. మరికొందరు భక్తులు సుమారు 20 మంది మరో ట్రాక్టర్ను తీసుకుని దుర్గామాత నిమజ్జనం దగ్గరికి బయలుదేరారు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు.
దుర్గామాత విగ్రహం ఉన్న ట్రాక్టర్ను క్యాచ్ చేయాలని డ్రైవర్ నిర్లక్ష్యంతో వల్లభి వైపు ట్రాక్టర్ను అతివేగంగా నడపడంతో అయ్యగారిపల్లి ఊరు దాటినా మరో క్షణంలో బాణాపురం మూలమలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న 20 మందిలో నలుగురు ఆవసాని ఉపేందర్(30), ములకలపల్లి ఉమ(40) చొడబోయిన నాగరాజు (22), బిచ్చాల యలకొండస్వామి(40) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
సమాచారం అందుకున్న ముదిగొండ ఎస్సై తాండ్ర నరేష్ ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం గ్రామీణ ఏసీపీ బసవరెడ్డి, సీఐ పి.సత్యనారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నలుగురు మృత్యువాత పడటంతో గ్రామం కన్నీటి సంద్రమైంది. మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో కన్నీరు మున్నీరుగా విలపించారు. అందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో..
సంఘటన స్థలాన్ని ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంవి రవీంద్రనాథ్ ఆదివారం సందర్శించి పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాల నివాసలకు వద్దకు వెళ్లి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ టి శ్రీనివాస్, ఆర్ఐ బి ఉషారాణి ఉన్నారు.
మృతదేహాలను సందర్శించిన జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే భట్టి
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన నలుగురు మృతదేహాలను విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మంలో పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ వెంకటేశ్వర్లును వారు ఆదేశించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి దుర్గాప్రసాద్, కమలాపురం ఎంపీటీసీ సభ్యులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి తదితరులు ఉన్నారు.
సీపీఐ(ఎం) నేతలు పరామర్శ
మృత్యువాత పడిన వారి కుటుంబాలను సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం ఆదివారం కమలాపురం గ్రామాన్ని సందర్శించి పరామర్శించారు. ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, సిపిఎం మండల నాయకులు మరికంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.