Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
తమ భూమిని కొందరు ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అట్టి భూమిని
తనకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ బాధితుడు తన పిల్లలతో కలిసి వాటర్ ట్యాంకు ఎక్కిన సంఘటన వరంగల్ క్రాస్‌రోడ్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం గోళ్లపాడు గ్రామానికి చెందిన యాకూబ్ వరంగల్ క్రాస్ రోడ్లో తనకు కొంత భూమి ఉందని, దానిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని, అయితే ఈ నెల 29న సర్వే చేసేందుకు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా ముత్తగూడెం గ్రామానికి చెందిన మౌలానా వారి కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారని బాధితుడు యాకూబ్ ఆరోపించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని, తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ యాకూబ్, తన కూతురు సనా, కుమారుడు బాసిన్లతో కలసి వరంగల్ క్రాస్‌రోడ్‌లోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ రవూఫ్, అర్ఐ నరేశ్‌లు చేరుకుని బాధితునితో మాట్లాడారు.చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని యాకూబ్‌కు అధికారులు హామీ ఇవ్వడంతో యాకూబ్ కుటుంబ సభ్యులు వాటర్ ట్యాంకు దిగారు. అనంతరం తనను బెదిరించిన మౌలానా, గౌస్ పాషాలపై యాకుబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యాకూబ్‌కు అసలు భూమే లేదు : గౌస్‌పాషా
వాటర్ ట్యాంకు ఎక్కిన గోళ్లపాడు గ్రామానికి చెందిన యాకుబ్‌కు అసలు వరంగల్ క్రాస్ రోడ్డులో భూమే లేదని మహమ్మద్ గౌస్ పాషా తెలిపారు. వరంగల్ గ్రాస్ రోడ్డులో సోమవారం గౌస్ పాషా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ పాషా మాట్లాడారు. మహమ్మద్ జాన్ బీ 23 ఏళ్ల క్రితం 297/అ సర్వే నంబర్లోని భూమిని బుడాన్ బేగ్ సతీమణి మాహమ్మద్ నూర్జహాన్ సుల్తానా, తిప్పని లింగారెడ్డి, శాబాదు స్వరూపాలకు విక్రయించారని, ఆ భూమికి యాకుబ్‌కు ఎటువంటి సంబంధమూ లేదని వివరించారు. పట్టాదారు పాస్ పుస్తకం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. మహమ్మద్ మౌలానా, అతని కుమారుడు గౌస్ పాషాలపై యాకుబ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సమావేశంలో లింగారెడ్డి, హస్సేన్ అలీ, సైదిరెడ్డి పాల్గొన్నారు.