Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ఓ రైతు తీవ్ర మనస్తాపంతో తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన మరిదు వెంకటేశ్వర్లుకు తండ్రి వారసత్వంగా గార్లపాడు రెవిన్యూ పరిధిలోనే 24/ ఆ/3 సర్వేనెంబర్లో ముప్పై ఎనిమిది కుంటల వ్యవసాయ భూమి వచ్చింది. ఈ భూమిని 2007లో వెంకటేశ్వర్లు తాన భార్య అయిన వెంకట లక్ష్మి పేరు మీద నమోదు చేయించాడు. 2018 వరకు పహానిలో వెంకటలక్ష్మి పేరే వస్తుంది. అదేవిధంగా వెంకటేశ్వర్లు సోదరుడు మరీదు నారాయణకు గార్లపాడు రెవిన్యూ పరిధిలోనే సర్వేనెంబర్ 24 /ఆ/2 లో 1. 01 ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఇలా ఉండగా మరీదు నారాయణ గార్లపాడు గ్రామానికి చెందిన తొండపు రాజారావుకు చెందిన గార్లపాడు రెవెన్యూ పరిధిలోని 24/ఆ/ 1 లో అర ఎకరం పొలం 2016లో కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించి నారాయణ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కానీ ఆ పొలాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాదాబైనామాలో మరీదు నారాయణ, మరీదు వెంకటేశ్వర్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచే కథ ప్రారంభమైంది. మరీదు నారాయణ, మరీదు వెంకటేశ్వర్లు పాసు పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మరీదు వెంకటేశ్వర్లు భార్య వెంకట లక్ష్మి పేరుతో ఉన్న 38 కుంటాల వ్యవసాయ భూమిని కూడా మరీదు నారాయణ పేరుతో పాసు పుస్తకము ఇచ్చారు. కానీ మరీదు వెంకటేశ్వర్లుకు మాత్రం పాసు బుక్కు ఇవ్వలేదు. పాస్ బుక్ కోసం వెంకటేశ్వర్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. రేపు, మాపు అంటూ రెవెన్యూ అధికారులు తిప్పుతున్నారు. చివరకు రికార్డులు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర్లు భార్య పేరు మీద ఉన్న పొలం నారాయణ పేరుతో పాసుబుక్ ఇచ్చినట్లు తేలింది. దీంతో లబోదిబోమంటూ వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరుగా విలపించాడు. నాలుగు నెలలుగా తన పొలాన్ని తనకు పాసు బుక్కు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. తిరిగి తిరిగి వేసారి తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు పురుగు మందు డబ్బా పట్టుకొని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. నా పొలానికి నాకు పాస్ బుక్ ఇస్తారా నన్ను ఆత్మహత్య చేసుకోసుకోమంటారా అంటూ మందు డబ్బాతో హల్ చల్ చేశాడు. దీంతో తాసిల్దార్ రావూరి రాధిక మరలా రికార్డు మొత్తాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లు పొలాన్ని నారాయణ పేరుతో పాసుబుక్ ఇచ్చినట్లు ఉంది. దీంతో తాసిల్దార్ తాము ఏమీ చేయలేమని నారాయణ వచ్చి మరల వెంకటేశ్వర్లు పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తేనే పాసుబుక్ వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై నారాయణను ప్రశ్నించగా తాను తొండపు రాజారావు వద్ద కొనుగోలు చేసిన అరెకరం పొలం తనకు రిజిస్ట్రేషన్ కాలేదని ఆ పొలాన్ని తనకు రిజిస్ట్రేషన్ చేస్తే, ఈ పొలాన్ని తాను వెంకటేశ్వర్లుకు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని మెలిక పెట్టాడు. ఆ పొలానికి ఈ పొలానికి సంబంధం లేదని గ్రామస్తులు నారాయణకు స్పష్టం చేసినా వినటం లేదు. ఆ పొలాన్ని వాళ్ళు తనకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆ పొలం తనకు రిజిస్ట్రేషన్ చేసే వరకు తాను కూడా రిజిస్ట్రేషన్ చేయనని స్పష్టం చేస్తున్నాడు. ఈ విషయంపై తాసిల్దార్ కూడా అతను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప తాము చేసేదేమీ లేదని చేతులెత్తేశారు. రెండు మూడు రోజులలో నారాయణను పిలిపించి సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తహశీల్దార్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు.