Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదదేశంగా పేరు గడించిన అమెరికా దేశం యొక్క ఆధిపత్యం రోజురోజుకు సన్నగిల్లుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో సిపిఎం నాయకులు ఏటుకూరి రామారావు, రచ్చ నరసింహరావు, పగిడికత్తుల నాగేశ్వర రావు, బెల్లం లక్ష్మి, అధ్యక్ష వర్గంగా సిపిఎం నేలకొండపల్లి మండల ఎనిమిదోవ మహాసభ అమరవీరుల నగర్లో జరిగింది. తొలుత గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహిం చారు. ఈ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్నన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ప్రదర్శనలో ముఠాపురం గ్రామానికి చెందిన కోలాట దళం వారు నిర్వహించిన కోలాట నత్యం ప్రజలను ఆకర్షించాయి. అనంతరం ప్రధాన సెంటర్లో పార్టీ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అమరవీరుల నగర్లో మహాసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను సీనియర్ నాయకులు వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దండా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన అమరవీరులకు, ఉత్తర ప్రదేశ్లో మృతిచెందిన రైతు వీరులకు మహాసభ సంతాపం ప్రకటించారు. అనంతరం జరిగిన మండల మహాసభలో తమ్మినేని మాట్లాడుతూ అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాదం, ఆధిపత్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం ఆర్థిక సంక్షోభం, కరోనాను నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందడమే అన్నారు. అదే సందర్భంలో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా చైనా కమ్యూనిస్టు దేశం అగ్రభాగాన నిలిచిందన్నారు. రానున్న కాలంలో కమ్యూనిస్టు చైనా ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ గా నిలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కూడా కరోనాను కట్టడి చేయడంలో ప్రధాన మంత్రి మోడీ వైఫల్యం చెందారన్నారు. మోడీ ఏడు సంవత్సరాల పాలనలో ఉన్నోడికి సేవ చేశారని పేదోడికి చేసిన సేవ శూన్యమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేందుకు సిద్ధమ య్యారు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈ ఒక్క ఏడాదిలోనే అమ్మే శారన్నారు. ఎయిర్ ఇండియాను టాటా బిర్లాకు కేవలం 15 వేల కోట్లకు మాత్రమే కట్టబెట్టారన్నారు. రైతులను వ్యవసాయానికి దూరం చేసే వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చి రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మోడీ కుట్ర చేశారన్నారు. మోడీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత పది నెలలుగా ఢిల్లీ కేంద్రంగా సుదీర్ఘకాలంగా రైతాంగం ధర్నాలు ఆందోళనలు నిర్వహించడం మోడీ అసమర్థ విధానాలకు అద్దం పడుతోందన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదంపై, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రాంతీయవాదంపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయనీ అన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి రాజ్యాధికారం కోసం, ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించి నేడు దళితులకు దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయల పంపిణీ పేరుతో మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దళిత బందును గిరిజనులకు, ఆదివాసీలకు వెనుకబడిన పేదలందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఉత్తర తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం నీటి సరఫరాపై వివక్ష చూపడం పట్ల ఆయన ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఏర్పడిన తెలంగాణలో ఇటువంటి వ్యత్యా సాలను చూపడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రత్యేక ప్రాంతాలుగా ఏర్పడితేనే అభివృద్ధి సాధించలేమని, పాలకుల విధానాల్లో మార్పు రావాలని సిపిఎం చెప్పిన విషయం నేడు నగసత్యం అయిందన్నారు. రానున్నది కమ్యూనిస్టుల కాలమని, కమ్యూనిస్టు సిద్ధాం తాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. గ్రామాలను పూర్వవైభవం దిశగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు పార్టీ నిర్మాణంపై మాట్లాడారు. ఈ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, మండల కార్యదర్శి గొడవర్తి నాగేశ్వరరావు, కె.వి రామిరెడ్డి, రాసాల కనకయ్య, భూక్య కష్ణ, దుర్గి వెంకటేశ్వర్లు, బలుసు హనుమంతరావు, సిరికొండ ఉమా మహేశ్వరి, మారుతిి కొండలరావు, ఎడ్ల తిరుపతిరావు, వెంకటయ్య, శీలం అప్పారావు, యలమద్ది వెంకటేశ్వర్లు, అశోక్, మందడపు మురళీకృష్ణ, లెనిన్, రాసాల నవీన్, పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, కట్టికోలా వెంకటేశ్వర్లు, ఎర్రదేశి నరసింహారావు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా కేవీ రామిరెడ్డి
సిపిఎం నేలకొండపల్లి మండల కార్యదర్శిగా నేలకొండపల్లి పట్టణానికి చెందిన కె.వి రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కార్యదర్శితో పాటు ఎనిమిది మంది కార్యదర్శివర్గ సభ్యులను మరో 12 మందిని కమిటీ సభ్యులుగా మొత్తం 22 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.