Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేత్రపర్వంగా పుప్పార్చన
అ ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించే శబరి స్మతియాత్రను ఈ ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, కొద్దిమంది గిరిజన భక్తులతోనే బుధవారం నిరాడంబరంగా నిర్వహించారు. భక్త శబరి వారసుల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. దేవస్థానం ఈఓ, ఆలయ అర్చకులు, అధికారులు శబరి విగ్రహాం వద్ద పూజలు చేశారు. దేవస్థానం వైదిక సిబ్బంది, అర్చకులు వేద పండితులు ముందుగా విశ్వక్సేన ఆరాధన నిర్వహించి, హారతి ఇచ్చారు. అనంతరం తూము నర్సింహా దాసు, భక్త రామదాసు విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నది జలాలతో ధ్వజస్థంభానికి అభిషేకం జరిపారు. దేవస్థానం సిబ్బంది పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి, బలిపీఠం వద్ద పూజలు చేశారు. శబరి చిత్రపటంతో, శబరి వంశీయులు కొమ్ము డాన్సులతో, రేలా నృత్యాలతో ఆలయ ప్రదక్షిణ, నగర ప్రదక్షిణతో వీథులన్నీ పరవశించాయి. అదేవిధంగా వాల్మీకి జయంతిని పురస్కరించుకొని చిత్రకూట మండపం వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి అర్చకులు పూజలు జరిపారు.
భక్త శబరి చిత్రపటంతో గిరిజనులు భద్రాచలం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్, బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు, అక్కడ నుండి రామాలయం వరకు ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు పట్టణ వాసులను అలరించాయి. శబరి స్మృతియాత్రలో పాల్గొన్న గిరిజనులను దేవస్థానం ఈఓ శివాజీ వస్త్రాలను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం ఈఓ బి. శివాజీ, ఏఈఓ శ్రావణ్ కుమార్, డీఈ రవీందర్రాజు, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు అమరవాది విజయ రాఘవన్, వైదిక సిబ్బంది, అర్చక సిబ్బంది, గిరిజన సంఘ నేతలు ముర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.