Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొత్తగూడెం
నిరుద్యోగ యువతతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందని, చాటలో తౌడేసీ తమాషా చూస్తుందని తెలుస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్కిల్డ్ లబ్ధిదారులకు ఎంపికలు జరిగాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సుమారు 2250 మంది అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ మాసంలో ఒకసారి, జూలై మాసంలో రెండు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక జరిగింది. సుమారు 760 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ నివేదిక అందజేశారని సమాచారం. అయినప్పటికీ అధికారులు ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లు కేటాయించలేదు. ఒకే నోటిఫికేషన్‌కు మూడోసారి మరో దఫా బుధవారం ఎంపిక జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో జరిగిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 2వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. గత రెండు దఫాలుగా నిర్వహించిన లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన వారందరికీ ముందు యూనిట్లు కేటాయించాలని, తర్వాత మిగిలిన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు అభ్యర్థుల మధ్య తోపులాట, గందరగోళ పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ అభ్యర్థుల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీ కార్పోరేషన్, బ్యాంకర్ల ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఎంపిక సాగింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంకు లబ్ధిదారుల ఎంపిక గతంలో చేసినప్పటికీ వారికి యూనిట్లు కేటాయించకుండా అధికారులు తాత్సారం చేశారని, దీని వలన గతంలో ఎంపికైన వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. కార్పొరేషన్ రుణాల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఎంపిక నిరుద్యోగులతో ప్రభుత్వం చాటలో తౌడేసీ తమాషా చుస్తున్న తీరుగా నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని యువత మండిపడ్డారు.