Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి మాయమాటలతో లొంగదీసుకొని పెళ్ళి చేసుకోమంటే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంట్లో ప్రియురాలు నిరసన దీక్ష చేపట్టిన ఘటన మండల కేంద్రమైన కారేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఎర్రబోడుకు చెందిన కోనం సునిత ఖమ్మంలో డిగ్రీ చదువుతుంది. కారేపల్లిలో మోడల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు కారేపల్లికి చెందిన సముద్రాల వేణుతో అతని సోదరి ద్వారా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఖమ్మంలో డిగ్రీ చదువుతున్న సునిత దగ్గరకు తరచు వెళ్లి పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రేమించి యువకుడి కోసం తన తల్లిదండ్రులను కాదనుకొని యువకుడితో పెళ్ళి దాకా వెళ్ళటానికి సిద్దమైంది. ఈ క్రమంలో సునితను గర్భవతి చేసిన వేణు పెళ్ళి చేసుకుంటానని యువతికి అబార్షన్ కూడా చేయించాడు. తీరా అబార్షన్ చేసుకున్న తర్వాత యువకుడి కపట నాటకం బయటపడింది. తాను పెళ్ళిచేసుకోనంటూ తన నిజస్వరూపాన్ని బయట పెట్టినట్లు యువతి సునీత బోరు విలపిస్తూ తెలిపింది. తనను పెళ్ళిచేసుకోవాలని యువకుడిని వేడుకుంటుంది. ఈ విషయమై ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ కేసు పెట్టి కౌన్సింగ్ నిర్వహించినా వేణులో మార్పు రాలేదు. బాధితురాలు సునిత కారేపల్లి పోలీస్ స్టేషన్ పిర్యాదు చేసి యువకుడి ఇంట్లో నిరసనకు దిగింది. తనకు వేణుతో పెళ్ళి ముఖ్యమని, కేసు పెట్టి జైలుకు పంపటం కాదంటూ పెళ్ళికి వేణును ఒప్పించాలని పెద్దమనుషులను, యువకుడి తల్లిదండ్రులను వేడుకుటుంటుంది. బాధితురాలి పిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పి.సురేష్ యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.