Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే సీబీసీఐడీ విచారణకు ఆదేశించండి
- బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆస్కార్ ఆవార్డును మించిన నటనను ప్రదర్శిస్తూన్నారని, ఇకనైనా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ ఘాటుగా విమర్శించారు. శుక్రవారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామేష్ మాట్లాడారు. జీవో నెం.76పై జరుగుతున్న అవినీతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందేనని అన్నారు. ఎమ్మెల్యే వనమా నాటకాలు, డ్రామాలు ఆపి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఓ నెం 76లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్న పట్టించుకోకుండా జీఓ 76లో అవినీతి జరిగిందని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెవెళ్తా అని మీరే అంటారు..? అవినీతే జరుగకుండా పారదర్శకంగా పట్టాల పంపిణీ చేస్తామని మీరే ప్రకటించడం అంటే...! ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలని ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ అంటూ నయా నాటకానికి తెరలేపుడు ఎందుకు..? జీఓ 76 బాగోతం మొదలు అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏమి జరిగిందో తహసీల్దార్ కార్యాలయం నుంచి సీసీ ఫుటేజులు తెపించుకొని చూడండని, మొత్తం తమరికే తెలుస్తోందని సూచించారు. అవినీతి జరిగిందని బహిరంగంగా ఒప్పుకుని, విచారణకు మాత్రం ఆదేశించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తు అమాయక ప్రజలను మోసాగించకడమే కదా అన్నారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజల మీద ప్రేమ ఉంటే తక్షణమే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి ప్రజల వద్ద నుంచి దళారులు దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు ఇప్పించాలని, జీవోని ఆసరాగా చేసుకుని దందా చేసిన సదరు దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వసూలు చేసిన రూ.లక్షలు తిరిగి ప్రజలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షుడు బొంతు సత్యకిరణ్, మహిళా నాయకురాలు వీణ, తిప్పాని శిరీష, గెద్ద కిశోర్, గోదా రజనీ, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.