Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - వైరాటౌన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని అన్ని రంగాలను దివాలా తీపించి దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వైరా పట్టణ 14వ మహాసభ శనివారం అమరజీవి కామ్రేడ్ వేదగిరి శ్రీనివాసరావు నగర్ నందు జరిగింది. మహాసభ ప్రారంభ సూచకంగా సిపిఐ (ఎం) జెండాను పార్టీ సీనియర్ నాయకులు సంక్రాంతి మదుసుధన రావు ఎగురవేశారు.
అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా మణి, బోడపట్ల రవీందర్, చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయడం వలన రైతులు వ్యవసాయానికి దూరం అవుతారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలకు నిర్వీర్యం చేసి కార్మికుల హక్కులను హరిస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. మత రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందని అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత హామీలను నెరవేర్చకుండా ఎన్నికల కోసం కొత్త హామీలు ఇస్తూ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను, చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రాజకీయ విద్యను, సైద్ధాంతిక అవగాహనను పెంచు కోవడానికి సభ్యులు అందరూ విధిగా నవతెలంగాణ, మార్క్సిస్టు పత్రికను చదవాలని సూచించారు. పార్టీ నిర్మాణ పద్ధతులకు అనుగుణంగా పనిచేయడం ద్వారా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు మహాసభ స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను సమీకరించి విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు.అనంతరం 17మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యదర్శిగా సుంకర సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వయస్సు రిత్యా పట్టణ కమిటీ నుండి రిలీవ్ అయిన మల్లెంపాటి ప్రసాదరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, బేజవాడ వీరభద్రంలకు అభినందనలు తెలిపారు. మహాసభలో జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాల్లపల్లి కృష్ణ, పారుపల్లి ఝాన్సి, పారుపల్లి దేవేంద్ర, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, రూరల్ కార్యదర్శి తోట నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మల్లెంపాటి రామారావు, బొంతు సమత, పట్టణ కమిటీ సభ్యులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, మాడపాటి మల్లికార్జునరావు, అనుమోలు రామారావు, రాచబంటి బత్తిరన్న, హరి వెంకటేశ్వరరావు, గుమ్మా నరశింహారావు, గుడిమెట్ల మోహన్రావు, పారుపల్లి చంద్రశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.