Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-సుజాతనగర్
గిరిజనులకు తక్షణమే మౌలిక వసతులను కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. శనివారం పాత అంజనాపురం గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వారు పాల్గొని మాట్లాడుతూ గ్రామకంఠం భూమిలో గత ఎనిమిది నెలలుగా ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం కొనసాగిస్తుంటే వారికి తాగటానికి నీరు, విద్యుత్ రహదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా ఫలితం శూన్యం అని అన్నారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం అవుతుందని అన్నారు. ఇకనైనా హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జాటోత్ కృష్ణ, మండల కార్యదర్శి వీర్ల రమేష్, కాట్రాల తిరుపతిరావు, గంధ మల్ల భాస్కర్, నాగేశ్వరరావు, నాగరత్నమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.