Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం హత్యాయత్నం
నవతెలంగాణ - ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ జబ్బార్ (బర్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి)పై హత్యాయత్నం చేసిన ముగ్గురు దోషులెవరో శనివారం ఉత్కంఠ వీడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బర్లగూడెం గ్రామానికి చెందిన పూనెం సురేందర్ తల్లి లక్ష్మి అనారోగ్యంతో గత ఆగస్టు 29న కొత్తగూడెం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సురేందర్ తల్లి మరణ ధృవీకరణ పత్రం కోసం సురేందర్ జబ్బార్ (కార్యదర్శి)ను ఈనెల 2న కలిశాడు. జబ్బార్ సానుకూలంగా స్పందించి అందుకు సంబంధించిన ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆధారాలు సక్రమంగా లేకపోవడంతో డెత్ సర్టిఫికెట్ సంబంధించి అక్టోబర్ 5న ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సురేందర్ టేకులపల్లి మండలం ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎంపీడీవో కార్యాలయంలో తన తల్లి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. సర్టిఫికెట్ పై స్థానిక కార్యదర్శి స్టాంప్ వేసి సంతకం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదని సురేందర్ కోపంతో మరో ఇద్దరు (బర్లగూడెం, కొప్పురాయి) గ్రామాల మైనర్ యువకులతో కలిసి ఈనెల 11న జబ్బార్ బర్లగూడెంలో తన విధులు ముగించుకుని స్వగ్రామం ఆళ్ళపల్లిలో ఇంటికి బైక్ పై వస్తున్న క్రమంలో ముందుగా అనంతోగు గ్రామ సమీపంలో ముగ్గురు బైక్ పై వచ్చి మార్షెలవాగు వద్ద మాటు వేశారు. అక్కడ ఒకరు బైక్ లిఫ్ట్ అడుగగా ఆగకుండా వస్తున్న తనను ఆళ్ళపల్లి శివారులోని చిన్నలవొర్రె వద్ద తమ బైక్ పై వచ్చి అటకాయించారు. జబ్బార్ బైక్ పై ఉండగానే సురేందర్ కర్రతో తలపై, చేతిపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నం చేశాడు. అటుగా వస్తున్న బైక్ వెలుతురికి కనపడతామని సంఘటనా స్థలం నుంచి బైక్ పై వెళ్లిపోయారు. జబ్బార్ కుటుంబ సభ్యులు ఈనెల 12 న పెట్టిన కేసు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై పి.సంతోష్ 12 రోజులు దర్యాప్తు జరిపి శనివారం ప్రధాన నిందితుడు పూనెం సురేందర్‌ను జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇల్లందుకు, ఇద్దరు మైనర్లను జువెనల్ కోర్టు ఖమ్మం కు రిమాండ్ కు తరలించారు.