Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్వానంగా అంతర్గత రహదారులు
- పట్టించుకోని అధికారులు కౌన్సిలర్లు
- ఇబ్బందులు పడుతున్నా ప్రజలు
నవతెలంగాణ-కొణిజర్ల
'కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే అభివృద్ధి జరగదని, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే గ్రామాల్లో కూడా అదే పార్టీలకు చెందిన వారు ప్రజాప్రతినిధులుగా ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉదరగొట్టే నాయకులు ఒక సారి పల్లిపాడు మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామాన్ని సందర్శించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో 18, 19 వార్డులలో 3 వేల మంది జనాభ ఉండగా సుమారు 1400 వందల ఓట్లు ఉన్న ఈ గ్రామంలో ఏ వీధి చూసిన అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండటమేకాక మూర లోతు గుంతలతో రహదారులకు ఇరువైపులా పిచ్చిచెట్లు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇండ్ల పక్కన వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తిచెందుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన నిధులు ఎక్కడా ఖర్చు చేసారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అనే మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి తప్ప క్షేత్ర స్థాయిలో మాత్రం అభివృద్ధి శూన్యంగానే కనబడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించేవారే లేరని ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యంమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారించాలని కౌన్సిలర్లు చూట్టూ ప్రజలు తిరిగిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం మున్సిపాలిటీ అధికారులు స్పందించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి : చింతనిప్పు చలపతి, సీపీఐ(ఎం) మున్సిపాలిటీ నాయకులు, లాలాపురం,
గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామం ఎలా ఉందో మున్సిపాలిటీలో విలీనమైనప్పటికీ అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసిన స్పందనలేదు. ప్రధానమైన సమస్య అంతర్గత రహదారులు నిర్మించి డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.