Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
- జాటోత్ కృష్ణ, మచ్చ వెంకటేశ్వర్లు
- సమ్మెతో పెరిగిన వ్యవసాయ కూలీల రేట్లు
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల పరిస్థితి దినదినగండంగా తయారైందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ కృష్ణ, మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు బట్టు తండ, హేమ్లా తండా గ్రామాల్లో గత మూడు రోజులుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలి రేట్లు సమస్యపై గ్రామాల్లో గ్రూప్ మీటింగులు పెట్టి మూడు రోజులపాటు సమ్మెను నిర్వహించారు. సోమవారం రైతులు వ్యవసాయ కూలీలతో చర్చలు జరిపి కూలి రేట్లు పెంచడం జరిగింది. పత్తి చేలో కలుపుకి రూ.200 నుండి 250, వరి చేలో కలుపుకి 350 నుండి 400 రూపాయలు, మిర్చి తోటలో కలుపుకి రూ.250 నుండి 300 పెంచడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు, రైతుబంధు ప్రకటించినట్టు కూలి బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలు అన్నదమ్ముల్లాంటి వారని ఎవరికి ఏమి కష్టం వచ్చినా కలిసి ప్రభుత్వాలపై పోరాడి వారి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కూలీల కష్టాలను అర్థం చేసుకొని కూలీలతో చర్చించి రేట్లు పెంచిన రైతు సోదరులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాంకుడోత్ కొండల్ అజ్మీరా శ్రీను, కిషన్, లక్ష్మణ్, చందర్రావు, వ్యవసాయ కూలీ ముఠామేస్త్రి రాణి, బుజ్జి, జయమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.