Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన పెట్టుబడులు... తగ్గిన దిగుబడులు
- జాడలేని కొనుగోలు కేంద్రాలు...
దండుకుంటున్న దళారులు
- పట్టించుకోని అధికారులు..
ఆందోళనలో అన్నదాతలు
- రైతాంగ సమస్యలపై నేడు సెమినార్
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండల వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరో 20 నుండి 25 రోజులలో వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంది. మండల వ్యాప్తంగా ప్రస్తుత వానాకాలంలో 26 వేల ఎకరాలలో రైతులు వరి పంట సాగు చేసినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు స్థానిక దళారులకు అందిన కాడికి అమ్ముకొని మోసపోతున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు సైతం ఆరుదల లేదనే సాకుతో అతి తక్కువ రేట్లకు కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన పెట్టుబడులు, పంటలకు సోకిన తెగుళ్ళు తాకిడితో తగ్గిన దిగుబడులతో రైతులు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఎకరానికి ఇరవై నుండి 25 వేల వరకు పెట్టుబడి ఖర్చు వచ్చిందని దిగుబడులు మాత్రం కేవలం సరాసరి 25 బస్తాలకు మించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం సరైన మద్దతు ధర చెల్లించకుండా కేవలం క్వింటాకు ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 రూపాయలు, సాధారణ రకానికి 1940 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, తెగుళ్ల తాకిడితో పూర్తిగా తగ్గుతున్న దిగుబడుల నేపథ్యంలో క్వింటాకు కనీస మద్దతు ధర ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నిజానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం క్వింటాకు ఇరవై ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం 2500 రూపాయల మద్దతు ధర చెల్లిస్తే కొంత భారం తగ్గుతుందని రైతులు అంటున్నారు. ఇదిలా ఉండగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పెరిగిన పెట్టుబడులు తగ్గిన దిగుబడులుతో వారిని తీవ్ర కలవరానికి గురి చేస్తుండగా దీనికిి తోడు సరైన మద్దతు ధర లేకపోవడంతో ఈ ఏడాది కూడా అప్పుల భారం తప్పదని కౌలు రైతులు దిగులు చెందుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరుస్తారో లేదోననే భయం కూడా వారిని వెంటాడుతుంది. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని కౌలు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మండలంలోని చెరువు మాదారంం గ్రామంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సెమినార్ జరగనుంది. ఈ సెమినార్కు తెలంగాణ రైతు సంఘం రాష్ట్రర కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బండిి రమేష్, గొడవర్తిి నాగేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, మండల కార్యదర్శి రచ్చ నరసింహారావు హాజరవుతున్నారు. ఈ సెమినార్ లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని, పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వంం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే తెరవాలని యాసంగి పంటకు అవసరమైన ప్రణాళికను తక్షణమె ప్రకటించాలని డిమాండ్ చేయనున్నారు.
రూ.2500 గిట్టుబాటు ధర చెల్లించాలి
రెడ్డిమల్ల సత్యనారాయణరెడ్డి , పైనంపల్లి కౌలు రైతు
నేను 25 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. ఈసారి పెట్టుబడులు పెరిగాయి. పంటకు తెగుళ్ల ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో దిగుబడులు సైతం తగ్గుతున్నాయి. ఎకరానికి 20 వేలకు పైగా పెట్టుబడి ఖర్చు వచ్చింది. ఎకరానికి 12 బస్తాల కౌలు చెల్లించాలి. కానీ దిగుబడి మాత్రం 25 బస్తాలు మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం క్వింటాకు 25 వందలు మద్దతు ధర చెల్లించాలి. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలి :
మహేశ్వర వీరాంజనేయులు, చెరువుమాదారం రైతు
నేను సొంతం 3 ఎకరాలు, కౌలుకు మరో ఏడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. ఈసారి వరిసాగులో వెదజల్లే విధానాన్ని అనుసరించాను. తెగుళ్ళ ఉధతి కారణంగా పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దిగుబడులు సైతం తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఎకరానికి 25 వేల వరకు పెట్టుబడి ఖర్చు వచ్చింది. కౌలు పన్నెండు బస్తాలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం క్వింటాకు 25 వందల రూపాయల మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలి. పంట కోతకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.