Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకోవటానికి సీపీఐ(ఎం) సన్నద్ధం
- తరతరాల నుండి ఉంటున్న తమను ఎలా తొలగిస్తారని బాధితుల ప్రశ్న
నవతెలంగాణ-ఎర్రుపాలెం
నిరుపేద కుటుంబాలైన లంబాడి, ఎరుకల, కులాలకు చెందిన గిరిజనులు తరతరాలుగా సుమారు 80 సంవత్సరాల నుండి గ్రామానికి సంబంధించిన పోరంబోకు భూములలో పూరి గుడిసెలు నిర్మించుకొని 30 కుటుంబాల వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిరుపేదలైన గిరిజనుల కుటుంబాల గృహాలను తొలగించాలని దేవాదాయ శాఖ వారు ప్రయత్నం చేస్తుండటంతో వాటిని అడ్డుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని సిపిఎం నాయకులు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. జమలాపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన పుట్ట కోట అనబడే సుమారు ఐదు ఎకరాల సాగు భూమి చుట్టూ పెద్ద ఎత్తున కట్ట ఉంది. ఆ కట్ట చుట్టూ దిగువ భాగానా కొంత మంది గృహాలు నిర్మించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయానికి వచ్చే యాత్రికుల బస కొరకు నిర్మించిన సత్రం గదుల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ప్రహరీ గోడ బయట భాగంలోను ఆర్టీసీ బస్టాండ్ ప్రహరీ గోడ పక్కన గిరిజనులు గృహాలు నిర్మించుకొని కాపురం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు గృహాలు నిర్మించిన స్థలం దేవాలయానిదని, 6-7 సర్వేనెంబర్లో గల ఒక ఎకరం 76 సెంట్ల భూమిలో 34 మంది ఆక్రమించుకొని గృహాలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించే ప్రయత్నానికి సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ వారు గ్రామానికి చెందిన పోరంబోకు, గ్రామ కంఠం భూములని, వాటిని ఎలా తొలగిస్తారని దేవాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. దేవాలయం అధికారులకు గ్రామపంచాయతీ వారికి ఈ స్థలంపై వివాదం చోటు చేసుకుంది. 4వ సర్వేనెంబర్ దేవాలయానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయని, 10వ నెంబరు సర్వేలో బాధితులు ఉన్నారని, సర్వే నెంబర్లు మారాయని వారు తెలుపుతున్నారు. గతంలో దేవాలయం వారు ఆక్రమణలను తొలగించి దేవాలయ భూముల చుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ వారు ఇప్పటి పరిస్థితిని ఉత్పన్నం చేసి గృహాలు తొలగించటానికి ప్రయత్నం చేసిన సందర్భంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర పార్టీ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జమలాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో దేవాలయ శాఖ వారు గృహాలు తొలగించటానికి ప్రయత్నం చేసిన సందర్భంలో గృహాలను తొలగించకుండా అడ్డుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ శాసన సభ ఫ్లోర్ లీడర్ బోడేపూడి వెంకటేశ్వరరావు, శాసనసభ్యులు కట్టా వెంకట నరసయ్య దృష్టికి సమస్యను గృహ నివాసదారులతో కలిసి తీసుకుని వెళ్లడం జరిగింది. ఆ గృహాలను పరిశీలించిన శాసనసభ్యులు దేవాదాయ శాఖ వారితోనూ దేవాలయ అధికారులతో మాట్లాడి గృహాల తొలగింపు కార్యక్రమం నిలుపుదల చేశారు. రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదించి 2000 సంవత్సరంలో మార్చి నెల మూడో తారీఖున అసైన్మెంట్ ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. సిపిఎం పార్టీ జమలాపురం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ వాసిరెడ్డి దుర్గాప్రసాద్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి తోట సాంబశివరావు, నాయకులు రామిశెట్టి ప్రసాద్ రావు, గద్దల సంగయ్యల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలను నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేశారు. అసైన్మెంటు ఇళ్ల పట్టాలు ఉండటంతో 2005వ సంవత్సరంలో ప్రభుత్వం వారు పక్కా గృహాలు మంజూరు చేశారు. ఆర్థిక వెసులుబాటు ఉన్నవారు ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను నిర్మించుకున్నారు.అప్పటి నుండి ఎటువంటి గృహాలు తొలగింపు చర్యలు చేపట్టని దేవాదాయశాఖ 20 సంవత్సరాల అనంతరం ఆక్రమణలను తొలగించాలని ప్రయత్నం చేయడం విడ్దూరంగా ఉందని గ్రామస్తులు దేవాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
దేవాలయ భూములు ఆక్రమిస్తే చర్యలు :
కొత్తూరు జగన్ మోహన్ రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి
దేవాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీ కాంతరావు దేవాలయానికి వచ్చిన సందర్భంలో దేవాలయ భూములను పరిశీలించి దేవాలయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ చర్యలు చేపడుతున్నాం.
మంత్రి దృష్టికి తీసుకెళ్తా : మూల్పూరి స్వప్న, సర్పంచ్
నిరుపేదలు ఉంటున్న గృహాలు దేవాలయ భూములా గ్రామకంఠం భూములా సర్వే చేయిస్తాం. బాధితుల సమస్యను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరు కుమార్ దృష్టికి తీసుకెళ్తా. శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తా.
గృహాలు తొలగిస్తే అడ్డుకుంటా :
దివ్వెల వీరయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
దేవాదాయ శాఖ వారు గృహాల తొలగింపునకు చర్యలు చేపడితే సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకుంటాం. బాధితులకు అండగా ఉంటాం. గృహాల తొలగింపు ఆలోచనను దేవాలయ అధికారులు మానుకోవాలి.