Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనా పినపాక నియోజకవర్గంలో మారుమూల పల్లెలు, సరైన రహదారులు లేవు. వర్షాకాలంలో వాగులు పొంగితే రాకపోకలు నిలిచిపోతాయి. స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు చొరవతో ప్రతిపాదనలు నిధుల మంజూరులో జాప్యం చోటుచేసుకుంటుంది. డీఎంఎఫ్ నిధుల కోసం విన్నవించినా నిధులు విడుదల కాలేదని దీనితో అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేదన్నారు. 90కి పైగా ప్రతిపాదనలు వివిధ సమస్యలపై పంపినా నిధులు మంజూరు కాలేదు. ప్రధానంగా నియోజకవర్గంలో భూర్గంపాడ్, మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి, మండలాల్లో 190 కోట్లతో 90 కి పైగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.ఇప్పటివరకు 10 ప్రతిపాదనలు మాత్రమే మంజూరయ్యాయి. ఏడాది క్రితం పంపిన వాటికి అతీగతి లేక, ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది. ప్రతిపాదనలో భాగంగా 45కి పైగా గ్రామాల్లో రహాదారుల నిర్మాణానికి ప్రాధాన్యం కల్పించారు. భవనాలు చెరువుల అభివృద్ధికి డ్రైనులు, వాణిజ్య దుకాణాలు, వంతెనలు, చెక్‌డ్యాంలు, సీసీ రహదారులు, అర్అండ్బీ రహదారులు, ఇంకా అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఇసుక వాగుపై, తుమ్మలచెరు వద్ద లోతు వాగుపై వంతెనలు నిర్మించకపోవండతో దశాబ్దాలుగా ఆదివాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి నిర్మాణాలు ప్రతిపాదనలు పంపారు. ఆల్లపల్లి, వెంకటాపురం సింగారం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేరకు రహదారి సమస్య 40 సంవత్సరాల నుండి తీరడం లేదు. నడిమిగూడెం, అడవిరామారం మధ్య 10 కిలోమీటర్ల మేర రహదారి సమస్య, చింతపడి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆళ్లపల్లి రాయిగూడెం మధ్య రహదారి కిన్నెరసానిపై వంతెన నిర్మించాల్సి ఉంది. మణుగూరు నెల్లిపాక మధ్య బీటీ రహదారిని చేపట్టాలి. కరకగూడెం మండలంలో చొప్పాల, గొడుగుబండ గ్రామాల మధ్య బీటీ రహదారిని ఏర్పటుచేయాలి. పినపాక మండలం కొత్తూరు, సామర్లకోట మధ్య బీటీ రహదారుల నిర్మాణానికి పురోగతిలేదు.