Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
అప్పుల భారం భరించలేక ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేలకొండపల్లి గ్రామానికి చెందిన రాయల సుదీర్(42) గత కొంత కాలంగా నేలకొండపల్లిలో ఫైనాన్స్ వ్యాపారంతో పాటు ఫ్యాన్సీషాప్, ఆటో మొబైల్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో వస్తున్న నష్టాలతో అప్పుల భారం పెరిగిందన్నారు. అప్పుల భారం భరించలేక సదరు వ్యాపారి భార్య ఇంట్లో లేని సమయంలో 24వ తారీకునా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ దొరకలేదు. బుధవారం చెరువుమాదారం భైరవునిపల్లి గ్రామాల మధ్య బాలయ్య అనే రైతు వ్యవసాయ బావిలో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.