Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుపూజోత్సవ వేడుకల్లో వక్తలు
- ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఆవార్డుల ప్రదానం
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశపురోగతికి విద్య చాలా అవసరమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన వేడుకలు గురుపూజోత్సవానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించే రథసారధులు, విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చేది కూడా ఉపాధ్యాయులేనని చెప్పారు. విద్య వల్లనే నేను కలెక్టర్‌ను కాగలిగానని అనుదీప్ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. నాకు విద్యాబోధన అందించడంలో తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువులకు ఎల్లపుడు రుణపడి ఉంటానని చెప్పారు. కోవిడ్ వల్ల పాఠశాలలు నిర్వహణకు అవకాశం లేకుండా పోయిందని, తద్వారా ఆన్లైన్లో విద్యాబోధన చేసినప్పటికి విద్యార్థులు అనుకున్న స్థాయిలో ముందుకు పోలేకపోయారని, కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులకు తిరిగి ప్రాధమిక స్థాయి నుండి విద్యాభ్యాసం చేయాలని సూచించారు. విద్యార్థులు చదివిన దానికంటే చూసి నేర్చుకున్నది మంచిగా గుర్తుండి పోతుందనే లక్ష్యంతో జిల్లాలో రూ.1.84 కోట్లతో 100 డిజిటల్ తరుగతులు ఏర్పాటు చేస్తున్నామని, ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి కాగా ఉపాధ్యాయులు శిక్షణలో ఉన్నారని చెప్పారు. విద్యకు పేద, ధనిక అనే తారతమ్యం ఉండదని, నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు అత్యధికంగా జీవిస్తున్న మన జిల్లాలో నాణ్యమైన విద్యాబోధన జరగాలని చెప్పారు.
మౌలిక వసతుల కల్పనకు నిధులు.....ఎమ్మెల్యే వనమా
మౌలిక సదుపాయాలు కల్పనకు తన నియోజకవర్గ నిధులు నుండి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమెల్యే వనమా వెంకటేశ్వరావు తెలిపారు. విద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిదిద్దే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం విద్యవల్ల మాత్రమే సాధ్యపడుతుందని చెప్పారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చేది విద్యేనని, అందువల్ల విద్యార్థులు తరగతి గదుల్లో విన్న పాఠాలను శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పారు. దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం సమాజానికి అత్యంత ముఖ్యమన్నారు. యువత సెల్ ఫోన్, సినిమాలు, సీరియళ్లు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి....ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ప్రాధమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రాధమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా పాలనాధికారిగా ఉండటం చాలా సంతోషమని చెప్పారు. ప్రభుత్వ విద్య మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. విద్య కంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదని, దేశం విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తే అభివృద్ధి సుసాధ్యమవుతుందన్నారు. విద్య ఎంతో ప్రాధాన్యత గలదని చెప్పారు. విద్యాభివృద్దిపై పెద్ద ఎత్తున చర్చలు జరగాలని ఆయన సూచించారు. నిజమైన, గుణాత్మకమైన విద్యపై చర్చలు చాలా అవసరమని చెప్పారు. విద్యారంగాన్ని సరైన మార్గంలో తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ సేవలు అభినందనీయమన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు తన నిధులు నుండి రూ.48 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులను సమాజంలో గొప్ప పౌరులుగా తయారు చేయు భాద్యతను తీసుకున్న గొప్ప వ్యక్తులని ఆయన కొనియాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు మెమెంటోలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి ఇ.సోమశేఖర శర్మ, జడ్పీ సిఈఓ మెరుగు విద్యాలత, మున్సిపల్ కౌన్సిలర్లు అంబుల ప్రసాద్ బాబు, అల్జీల్ ఉన్సీసాబేగం పాల్గొన్నారు.