Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 నెలలుగా రైతుల వీరోచిత పోరాటం
- రైతు ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
- తెలంగాణ రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, బండి రమేష్
నవతెలంగాణ- నేలకొండపల్లి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ రంగాన్ని రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసే దుర్మార్గమైన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందుకు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు, సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని చెరువుమాదారం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రచ్చ నరసింహారావు అధ్యక్షతన సెమినార్ జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిధులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటులో ఏకపక్షంగా దుర్మార్గమైన రైతు నల్ల చట్టాలను తీసుకు వచ్చి రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ చట్టాలు అమలు జరిగితే భవిష్యత్తులో రైతు బతుకు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కులవృత్తులు కనుమరుగైన చందంగా రైతు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కార్పొరేటు కంపెనీల సేవల కోసమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడు వ్యవసాయం నల్ల చట్టాలను తీసుకు వచ్చింది అన్నారు. నిత్యావసర సరుకుల సవరణ చట్టం పేరుతో సామాన్య ప్రజానీకంపై ధరల ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అన్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ వంటి నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింత భారంగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత 11 నెలలుగా ఢిల్లీ నడిబొడ్డులో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ లక్షలాది మంది రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 660 మంది రైతులకు పైగా తమ ప్రాణాలను తణప్రాయంగా అర్పించి ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. కేంద్రంలో సుదీర్ఘంగా జరుగుతున్న రైతు పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. ఇంతటి ఘనమైన రైతు ఉద్యమంలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకం భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు గొడవర్తి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ఏటుకూరి రామారావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కే.విరామిరెడ్డి, దుర్గి వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి పగిడికత్తుల నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు అబ్దుల్ మజీద్, ఎరదేశి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.